అనుకోకుండా చేస్తాడో లేక కావాలని వ్యవహరిస్తాడో కానీ.. సరిగ్గా విడుదలకు ముందు పవన్ కల్యాణ్ తన నోటి దురద చూపిస్తారు. తన సినిమాకు తానే అడ్డంకులు సృష్టించుకుంటారు. గతంలో వకీల్ సాబ్ విషయంలో ఇలానే జరిగింది. ఆ తర్వాత భీమ్లానాయక్ రిలీజ్ టైమ్ లో కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు బ్రో సినిమా విడుదలకు ముందు కూడా ఇదే జరగబోతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన గ్రామ/వార్డు వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఏపీ అంతటా కాక రేపుతున్నాయి. వైసీపీ నేతలు, జనసేన మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
పవన్ కల్యాణ్ పై కోపంతో వైసీపీ సర్కారు, అతడి సినిమా ప్రదర్శనను అడ్డుకోవచ్చని, ప్రత్యేక అనుమతులు ఇవ్వకపోవచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే ఇక్కడ మేటర్ అది కాదు. స్వయంగా వాలంటీర్లు, వాళ్లు కుటుంబీకుల నుంచి ఈ సినిమాపై వ్యతిరేకత రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ నెలాఖరుకు థియేటర్లలోకి వస్తోంది బ్రో సినిమా. పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమాను, ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, వాళ్ల కుటుంబీకులు వ్యతిరేకించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ చేసిన విమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలతో చాలామంది బాధపడ్డారు. ఆ ప్రభావం బ్రో సినిమా వసూళ్లపై కచ్చితంగా పడబోతోంది.
గతంలో కూడా తన సినిమాల విడుదలకు ముందు పవన్ ఇలానే వ్యవహరించారు. 'సన్నాసి' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఆ ప్రభావం భీమ్లానాయక్ సినిమాపై పడింది. అంతకంటే ముందు పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు జరిగాయి. అదే టైమ్ లో టికెట్ రేట్లు కూడా తగ్గడం వల్ల ఆ ప్రభావం వకీల్ సాబ్ సినిమాపై స్పష్టంగా పడింది. నిర్మాత దిల్ రాజు సినిమా వసూళ్లను కూడా బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు మళ్లీ అలాంటి సంకట పరిస్థితి బ్రో సినిమాకు దాపురించింది. అప్పుడంటే వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలకు కనీసం టైమ్ గ్యాప్ అయినా దొరికింది. ఈసారి బ్రో మూవీకి ఆ గ్యాప్ కూడా లేదు. ఈ నెలాఖరుకే సినిమా వస్తోంది. కచ్చితంగా ఏపీ ప్రజలు, మరీ ముఖ్యంగా వాలంటీర్ల కుటుంబాల నుంచి ఈ సినిమాకు సెగ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ప్రభుత్వం సైడ్ నుంచి చూసుకుంటే, ప్రత్యేకంగా పవన్ ను టార్గెట్ చేయడం లాంటివేం జరగకపోవచ్చు. ఆల్రెడీ అమల్లో ఉన్న జీవో ప్రకారం, బ్రో సినిమా బడ్జెట్ చూసి టికెట్ రేట్లలో సవరింపులు ఉంటాయి. ఇక అదనపు షో విషయానికొస్తే, అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటారు.
ఏదేమైనా తన ప్రతి సినిమా విడుదలకు ముందు పవన్ ఇలా తన నోటి దురద చూపిస్తే మాత్రం ఆరిపోయేది నిర్మాతలే. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు కూడా ఇదే సీన్ రిపీటైతే, భవిష్యత్తులో పవన్ తో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ముందుకురాకపోవచ్చు.