హీరోలకు భారీ మొత్తాలు ఆఫర్ చేసి ప్రకటనలు చేయించడం వరకు బాగానే వుంటుంది. కానీ అలాంటి సంస్థలు ఇబ్బందులో ఇరుక్కునపుడే హీరోలకు సమస్య అవుతుంది. మొన్నటికి మొన్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్తల్లోకి ఎక్కడింది. అంతకు ముందు ఇంకోటి. ఇప్పుడు మరోటి. వీటన్నింటికి సినిమా జనాలు ప్రచారం సాగించినవే. బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించినవే.
లేటెస్ట్ గా శ్రీసూర్య డెవలపర్స్ అనే సంస్థ మీద పోలీసులకు ఫిర్యాదులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. కొంత మంది కస్టమర్లు తాము ఈ సంస్థ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీ సభ్యులతో కలిసి చేసిన యాడ్ చూసి పెట్టుబడులు పెట్టి మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సంస్థ నుంచి తమ డబ్బులు వెనక్కు ఇప్పించాలన్నది వారి డిమాండ్ అని వినిపిస్తోంది.
నమ్రత, గౌతమ్, సితారలతో కలిసి మహేష్ బాబు ఈ సంస్థ కోసం యాడ్ చేసారు. ఇది చాలా కాలం కిందటి సంగతి. కానీ ఇప్పుడు ఆ సంస్థ మీద ఫిర్యాదు రాగానే, ఈ యాడ్ సంగతి గుర్తు చేస్తున్నారు. మహేష్ బాబు గతంలో చేసిన ఓ బెజవాడ సంస్థ కూడా ప్రాజెక్ట్ అనుకున్నట్లు కంప్లీట్ చేయడంలో ఒడిదుడుకుల్లో పడింది.
జనాలు వాళ్లంతట వాళ్లు పెట్టుబడులు పెట్టినా సినిమా జనాలు చెప్పారని పెట్టినట్లు అంటుంటారు. సినిమా జనాలు చెప్పినంత మాత్రాన గుడ్డిగా పెట్టుబడులు పెట్టకూడదని తెలియదా వీళ్లకు. చిరంజీవి, కే విశ్వనాధ్, సిరివెన్నెల, అనసూయ, బాలకృష్ణ, సుమ ఇలా సినిమా జనాలు అంతా ఏదో ఒక రియల్ ఎస్టేట్ యాడ్ ల్లో కనిపించిన వారే.