వాలంటీర్లు విషయంలో చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న తీరుకు, పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరుకు హస్తిమశకాంతరం అంతటి తేడా ఉంది. చంద్రబాబునాయుడుకు బహుశా సీనియారిటీ వలన వచ్చిన లౌక్యం కావొచ్చు. ఆయన వాలంటీర్ల గురించి నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. కానీ పవన్ కల్యాణ్ వాలంటీర్లు గురించి ఏ మాట మాట్లాడినా సరే.. వారి మీద ఆయనలో బీభత్సన పగ ద్వేషం ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది.
తమాషీ ఏంటంటే.. పవన్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆయన అనుచరులు కూడా.. వాలంటీర్లపై ఆయనలోని పగను పంచుకున్నట్టుగా వారిమీద దాడులతో చెలరేగిపోతున్నారు.
తాజాగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న సంఘటన జనసేన అభ్యర్థుల అతికి నిదర్శనంగా కనిపిస్తోంది. కాకినాడ జిల్లాలో ఒక వాలంటీరుకు పుట్టినరోజు కావడంతో.. స్నేహితులైన మరో ఆరుగురు వాలంటీర్లు కలిసి చిన్న పార్టీ చేసుకున్నారు. మోక్షిత ఫైనాన్స్ కంపెనీ అనే ఆఫీసులో వారు కలుసుకున్నారు. అక్కడ స్వీట్స్ కూల్ డ్రింక్స్ తీసుకుని పార్టీచేసుకున్నారు.
అయితే వారు పార్టీలో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా జనసేన గూండాలు విరుచుకుపడ్డారు. వాలంటీర్లను నానా దుర్భాషలాడారు. ఓటర్లకు డబ్బు పంచుతున్నారంటూ కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ తన కార్యకర్తలతో కలిసి లోపలకు చొరబడి వారిమీద దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఆ వాలంటీర్లలో ఒక అమ్మాయి ఏడు నెలల గర్భిణి అయినప్పటికీ.. ఆ విషయం పదేపదే చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా వారందరినీ అదేగదిలో రెండు గంటల పాటు నిర్బంధించి నానా యాగీచేశారు. ఈ గొడవలో గర్భిణి స్పృహతప్పిపోవడం కూడా జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి.. పంతం నానాజీ మీద క్రిమినల్ కేసు నమోదు అయింది.
వాలంటీర్ల వ్యవస్థ అంటే పవన్ కల్యాణ్ లో విపరీతమైన ద్వేషం, పగ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. చంద్రబాబు ఒకవైపు వాలంటీర్లను కొనసాగిస్తాం.. జీతాలు పెంచుతాం అంటుండగా.. పవన్ కల్యాణ్ చాలా దూకుడుగా.. వాలంటీర్లలో కొందరు మాత్రమే తప్పులు చేశారు అంటూనే.. బుట్టలో రెండు పళ్లు కుళ్లిపోతే బుట్టంతా పాడైపోతుంది.. అని తన సొంత భాష్యం చెబుతున్నారు. కుళ్లిపోయిన రెండు పళ్లను తీసి పారేయడం గురించి ఆయన ఆలోచించడం లేదు.
వాలంటీర్లు అందరినీ ఆయన ద్వేషంతోనే చూస్తున్నారు. ఆయన ద్వేషాన్ని, పగను పంచుకుంటున్న ఆ పార్టీ అభ్యర్థులు కూడా.. అదే తరహాలో.. వాలంటీర్లు చిన్న పార్టీ చేసుకున్నా వారిని నిర్బంధించేదాకా, దాడిచేసేదాకా వెళుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.