ప్రజలను ఆకట్టుకునేందుకు బాబు ష్యూరిటీ… భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో టీడీపీ అధినేత విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తనకు అధికారం ఇస్తేనే ప్రజలకు భవిష్యత్ వుంటుందని ఆయన చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంపై ప్రత్యర్థుల నుంచి సెటైర్స్ సరేసరి. ముగ్గురు ష్యూరిటీ ఇస్తే తప్ప, రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు బయటికి రాలేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అలాంటి చంద్రబాబునాయుడు ప్రజల భవిష్యత్‌కు ఏమని భరోసా కల్పిస్తారని ప్రత్యర్థుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టికెట్ దక్కని ఆశావహులు, అలాగే టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి ఆ పార్టీ నాయకులు షరతులతో సిద్ధంగా ఉన్నారు. చాలా నియోజక వర్గాల్లో టీడీపీ నాయకులు అలకబూనారు. కొందరు చంద్రబాబునాయుడు దగ్గరికెళ్లి తమకు మున్సిపల్ చైర్మన్ పదవి, అలాగే ఎమ్మెల్సీ ఇతరత్రా పదవులు ఇస్తామని ష్యూరిటీ ఇస్తే, తప్పకుండా మీరు సూచించిన అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తామని అంటున్నారు.
అయితే అలాంటి హామీలేవీ ఇవ్వనని, ముందుగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకు రావాలని చంద్రబాబు ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో టీడీపీ నాయకులు తీవ్ర నిరాశలో ఉన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ఇంత నిర్దయంగా వుండే వారు కాదని, ఏదో ఒకటి హామీ ఇచ్చి, రాజకీయ పబ్బం గడుపుకునే వారని చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో మాత్రం ఎవరికీ చంద్రబాబు ఫలానా పదవులు ఇస్తామని హామీలు ఇవ్వకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. తమ రాజకీయ భవిష్యత్‌కు ఏదో ఒక ష్యూరిటీ ఇస్తేనే కదా అభ్యర్థి గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేయగలమని నాయకులు అంటున్నారు. ఇందుకు చంద్రబాబు మాత్రం ససేమిరా అంటున్నారని తెలిసింది. దీంతో ఇష్టమైతే పని చేయడం, లేదంటే సొంత పనులు చూసుకోవడం ఒక్కటే ఉత్తమమని టీడీపీ నాయకులు అంటున్నారు.