ప్రచారమే నిజమైంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో గత ఏడాది చివర్లో వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వెలువడిన వెంటనే భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే వెంకట్రావ్ కాంగ్రెస్‌లో చేరిపోయారంటూ… ఓ ఫేక్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
అయితే ఆ ఫొటో ఇప్పడిది కాదని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఉన్న పాత చిత్రమని తెల్లం వెంకట్రావ్ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఆయన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. దీంతో ఖమ్మం జిల్లా అంతా కాంగ్రెస్‌మయమైంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. అందుకే రాహుల్ లేదా ప్రియాంక గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్‌ను వీడడం ఆ పార్టీని కలవరపెడుతోంది.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడు ఇదే పని చేసింది. అందుకే బీఆర్ఎస్ నేతలెవరూ గట్టిగా మాట్లాడలేని నిస్సహాయ స్థితి.