రాను రాను హీరోల రెమ్యూనిరేషన్లకు, ఓపెనింగ్ డే కలెక్షన్లకు పొంతన వుండడం లేదు. హీరోయిజం అన్నది రాను రాను తగ్గుతోంది. కేవలం కాంబినేషన్ మీద, ప్రాజెక్ట్ క్రేజ్ మీద ఆధారపడే ఓపెనింగ్ లు వుంటున్నాయి. లేదా టాప్ వన్ రేంజ్ హీరోలకు మాత్రం మంచి ఓపెనింగ్ లు వస్తున్నాయి.
టైర్ 2 హీరోల సినిమాలకు ఓపెనింగ్ అన్నది పూర్తిగా గాల్లో దీపంగా మారుతోంది. నాని తప్పిస్తే మరో టైర్ 2 హీరోలకు ఓపెనింగ్ తెగడం లేదు. వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్లకు ఓపెనింగ్ వుండడం లేదు. రవితేజ సీనియర్ హీరో అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు. కానీ 56 దాటిన రవితేజన కూడా సీనియర్ల జాబితాలో వేయాల్సిందే.
పాతిక కోట్లు దాటిన రవితేజ సినిమాలకు కూడా పెద్దగా ఓపెనింగ్ వుండడం లేదు. ఇక మిడ్ రేంజ్ లో శర్వా, నితిన్, మెగా హీరోలు చాలా మందికి ఓపెనింగ్ తెగడం లేదు. రవితేజ, రామ్, విజయ్ దేవరకొండ వీళ్లంతా పాతిక కోట్ల మేరకు రెమ్యూనిరేషన్లు తీసుకుంటున్న వారు. కానీ. ఓపెనింగ్ లు, కలెక్షన్లు చూస్తుంటే చాలా నీరసంగా వుంటున్నాయి. కానీ నిర్మాతలు పోటీ పడుతున్నారు. రెమ్యూనిరేషన్లు భారీగా ఇచ్చి, అంతకన్నా భారీగా ఖర్చుచేసి సినిమాలు చేసి చతికిల పడుతున్నారు.
ఫ్యామిలీ స్టార్ సినిమాకు నిర్మాత దిల్ రాజు 110 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందని వింటే అవునా.. నిజ్జమా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ సినిమాను ఆంధ్ర 16 కోట్ల రేంజ్ లో మార్కెట్ చేసారు. దిల్ రాజు తన స్వంతానికే వుంచుకున్నా నైజాంలో పది కోట్లకు పైగా వసూలు చేయాలి.
చూస్తుంటే దిల్ రాజు స్వంతానికి ఉంచుకున్న వైజాగ్, నైజాంల్లో భారీ డెఫిసిట్ తప్పేలా లేదు. అలాగే మిగిలిన చోట్ల ఎంత కొంత వెనక్కు ఇవ్వాలి. లేదా జిఎస్టీలు కట్టాలి. మొత్తం మీద ప్రాజెక్ట్ అంతా లెక్కలు ముగించినా ఇరవై నుంచి ముఫై కోట్లు నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. రవితేజ ఈగిల్ కూడా ఇలాంటి ఫలితాన్నే మిగిల్చింది. రామ్ గత రెండు సినిమాలదీ ఇదే పరిస్థితి. నాని సినిమాలు ఒక్కటే అలా అలా పాస్ అవుతున్నాయి.
పైగా హీరోలు పలువురు పాతిక కోట్లు తీసుకున్నా కూడా నాన్ థియేటర్ అమ్మకాలు, కొన్ని సార్లు థియేటర్ అమ్మకాలు కూడా వుండడం లేదు. అది మరీ చిత్రం. అందుకే నిర్మాతలు కూడా ముందు వెనుక ఆడుతున్నారు. పాతిక కోట్లు తీసుకున్న ఒక హీరో, ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద తలకాయతో మీరు ఫలానా పరభాష హీరోకి అంత ఇచ్చారు. నాకు ముఫై ఇచ్చి సినిమా చేయాలి ఈసారి అని అన్నాడట. అలాగే అని చెప్పిన ఆ పెద్దాయిన, ఈ హీరోలకు వాళ్ల మార్కెట్ వాళ్లకు తెలియదు. అంత కావాలి, ఇంతకావాలి అని అడగడం తప్ప అని తెలిసిన వాళ్ల దగ్గర కామెంట్ చేస్తున్నారు.
అంటే ఇప్పుడిప్పుడే నిర్మాతల్లో కూడా క్లారిటీ వస్తోంది. ఈ పాతిక కోట్ల హీరోల్లో ఎవరికి మార్కెట్ వుంది..ఎవరికి లేదు..అనేది తెలుస్తోంది. ఇలా తెలుస్తూ పోతే, అప్పుడు కానీ వీళ్ల డిమాండ్ కిందకు దిగదు.