ప్రముఖ హీరో రాజశేఖర్, ఆయన భార్య, నటి జీవిత తమకు భారీ మొత్తంలో డబ్బు ఎగ్గొట్టారని జోస్టర్ ఫిలిం ఫౌండర్ కోటేశ్వరరాజు, ఆయన భార్య, ఎండీ హేమ తీవ్ర ఆరోపణలు చేశారు. కోటేశ్వరరాజు దంపతులు మీడియాతో మాట్లాడుతూ జీవితా రాజశేఖర్ దంపతులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దంపతులు మంచివాళ్లని నమ్మి మోసపోయామని వాపోయారు. గరుడవేగ సినిమా నిర్మాణం కోసం రూ.26 కోట్లు అప్పుగా ఇచ్చామన్నారు.
అప్పు తీసుకునే సమయంలో తమకు తనఖా పెట్టిన భూములను, తర్వాత కాలంలో బినామీ పేర్లతో రాయించి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ చెప్పడం వల్లే అప్పు ఇచ్చామన్నారు. జీవితా దంపతులు తమకు ఇచ్చిన చెక్‌లు కూడా బౌన్స్ అయ్యాయని వాపోయారు. తాము అప్పు ఇచ్చినట్టు, అలాగే వాళ్ల డాక్యుమెంట్స్ అన్నీ పక్కా ఆధారాలు తమ దగ్గరున్నాయని వారు చెప్పుకొచ్చారు.
అప్పు ఇచ్చి తాము ఎంతో నష్టపోయామన్నారు. జీవితా దంపతుల కోసం తాము అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా తాము మాత్రం అప్పులు చెల్లిస్తామన్నారు. ఇప్పుడు తామెవరో తెలియదన్నట్టుగా జీవితా రాజశేఖర్ దంపతులు నటిస్తారని అన్నారు.
ఇదిలా వుండగా నటి జీవితా రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్‌బెయిల్ వారెంట్ జారీ చేసింది. జోస్టర్ ఫిలిం ప్రొడక్షన్స్ ఎండీ హేమ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కోటేశ్వరరాజు దంపతుల ఆర్థిక లావాదేవీల ఆరోపణలపై నటి జీవిత స్పందిస్తూ సుదీర్ఘ కాలం తర్వాత వాళ్లెందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
రేపు అన్ని విషయాలను వివరిస్తానని ఆమె అన్నారు. జీవితా మీడియా ముందుకొస్తే వాస్తవాలేంటో తెలిసే అవకాశం ఉంది.