ఆర్ఆర్ఆర్ మీద తమకు వున్న బంధాలతో నెత్తిన పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ అలా అని మరో సినిమాను తొక్కేయాలని చూడకూడదు. కేజిఎఫ్ 2 విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారమే కనిపిస్తోంది.
రికవరబుల్ అడ్వాన్స్ మీద విడుదల చేసారు కేజిఎఫ్ 2 ను. సినిమా విడుదలకు చాలా కాలం ముందు అడ్వాన్స్ ఫిగర్లు ఫిక్స్ చేసుకున్నారు. కానీ తీరా విడుదల వేళకు ఆ ఫిగర్లకు 40 శాతం కోత పెట్టారు. కేవలం 60 శాతం మాత్రమే తీసుకున్నారు.
కానీ ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని దాచి, కేజిఎఫ్ 2 అడ్వాన్స్ లు రికవరీ కావు అని సలార్ సినిమాకే అడ్జస్ట్ చేయాల్సి వుంటుందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. బురద జల్లడం అలవాటైపోయిన విద్య కదా? ఈస్ట్ గోదావరికి కట్టింది కేవలం నాలుగు కోట్లు. తొలివారంలోనే ఆ ఫిగర్ ను దాటేసింది. అలాగే వెస్ట్ లో కూడా. ఇచ్చింది మూడు కోట్లు. దాదాపు ఆ అంకెకు సమీపించింది కెజిఎఫ్ 2.
విశాఖలో మాత్రం డిస్కౌంట్ లేకుండా 10 కోట్లు కట్టారు అని టాక్ వుంది. అక్కడ ఏడు కోట్లు దాటేసాయి వసూళ్లు. విశాఖ పంపిణీ చేసిది వారాహి సంస్థ. అంటే తెలుగు వెర్షన్ ను సమర్పించిన సంస్థ. అందువల్ల లాభ నష్టాల లెక్కలు వేరుగా వుంటాయి. సీడెడ్ కు కట్టింది 12 కోట్లు. ఇప్పటికే ఎనిమిది కోట్లు దాటేసింది. ఇక్కడ కూడా నిర్మాతలు అయిన వారాహినే పంపిణీ చేసింది.
ఇక్కడ రెండు విషయాలు కీలకంగా వున్నాయి. వాస్తవ కలెక్షన్లు రిపోర్డ్ చేయడం మానేసాయి బిజినెస్ పోర్టళ్లు. ఆర్ఆర్ఆర్ కు మాత్రం తెల్లవారకుండా అంకెలు చూపించారు. రేపటి అంకెలు ఈ రోజే చూపించారు. కేజిఎఫ్ 2 కు మాత్రం ఉద్దేశపూర్వకంగా అంకెలు కనిపించకుండా చేస్తున్నారు. దీనికి మరో కారణం పుష్ప, భీమ్లా నాయక్ లను కేజిఎఫ్ 2 తెలుగు రాష్ట్రాల్లో బుల్ డోజ్ చేసి దాటేయడం కూడా.
ఇలా ఓ సినిమా కలెక్షన్లు దాచేయడం, అడ్వాన్స్ లు పెంచి చూపించడం అంటే ఆర్ఆర్ఆర్ మీద అభిమానం, కేజిఎఫ్ 2 మీద అక్కసు ఎంత వున్నట్లో?