బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కలెక్టర్ వేసిన సస్పెన్షన్ వేటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దీంతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకుడు రఘునందన్‌రావు, అలాగే సస్పెన్షన్ వేటు వేసిన సిద్ధిపేట కలెక్టర్‌కు గట్టి షాక్ తగిలినట్టైంది.
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 7న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నిర్వహించిన సమావేశంలో 40 మంది ఐకేపీ, 66 మంది ఎన్ఆర్జీఎస్ ఉద్యోగులు … మొత్తం 106 మంది పాల్గొన్నట్టు రఘునందన్‌రావు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఆధారంగా సమావేశంలో పాల్గొన్నారని కలెక్టర్ నిర్ధారించుకుని వారిపై వేటు వేశారు.
కలెక్టర్ చర్యల్ని సవాల్ చేస్తూ వారంతా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్నికల ప్రచారంలో వారంతా పాల్గొన్నారనే వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. దీంతో వారి సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఫిర్యాదు చేసిన రఘనందన్‌రావుతో పాటు ఎన్నికల అధికారులకు హైకోర్టు ఝలక్ ఇచ్చినట్టైంది. ఈ పరిణామంతో మరింత పకడ్బందీగా ఫిర్యాదు చేయాలన్న విషయం రాజకీయ పార్టీలకు బోధపడింది.