Rathnam Review: మూవీ రివ్యూ: రత్నం

చిత్రం: రత్నం రేటింగ్: 1.75/5 తారాగణం: విశాల్, ప్రియ భవాని శంకర్, సముద్రఖని, యోగి బాబు, గౌతం వాసుదేవ్ మీనన్, మురళిశర్మ తదితరులు సంగీతం: దేవిశ్రీప్రసాద్ కెమెరా: ఎం. సుకుమార్ ఎడిటింగ్: టి.ఎస్. జై నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్, ఇన్వేనియో ఆరిజిన్…

చిత్రం: రత్నం
రేటింగ్: 1.75/5
తారాగణం: 
విశాల్, ప్రియ భవాని శంకర్, సముద్రఖని, యోగి బాబు, గౌతం వాసుదేవ్ మీనన్, మురళిశర్మ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కెమెరా: ఎం. సుకుమార్
ఎడిటింగ్: టి.ఎస్. జై
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, జీ స్టూడియోస్, ఇన్వేనియో ఆరిజిన్
దర్శకత్వం: హరి గోపాలకృష్ణన్ నాడార్
విడుదల: 26 ఏప్రిల్ 2024

విశాల్ నటించిన ఈ “రత్నం”పై ఉన్నంతలో అంచనాలు ఏర్పడడానికి కారణం, ఈ చిత్ర దర్శకుడు సూర్యతో “సింగం” సిరీస్ తీసిన హరి కావడం. దానికి తోడు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్. కథనం ఆకట్టుకోవాలే కానీ డబ్బింగ్ సినిమాలని కూడా నెత్తిన పెట్టుకుంటారు తెలుగు ప్రేక్షకులు. ఇంతకీ ఈ ‘రత్నం’ మెరిసిందో లేదో చూద్దాం.

కథ 1994లో మొదలవుతుంది. వరుస హత్యలు వగైరాల నేపథ్యంలో కొంత ఫ్లాష్ బ్యాక్ చూపించాక కథ ప్రస్తుత కాలానికి వచ్చేస్తుంది. రత్నం (విశాల్) ని చేరదీసి పెంచినవాడు లోకల్ నాయకుడు పన్నీర్ స్వామి (సముద్రఖని). అన్ని విషయాల్లోను రత్నం అతనికి రైట్ హ్యాండ్ లా ఉంటాడు.

అనుకోకుండా రత్నం మల్లిక (ప్రియ) అనే అమ్మాయిని చూస్తాడు. ఆమె తన తల్లిలానే ఉండడంతో ఆమెను ఫాలో అవుతాడు. ఆమె లింగం అనే వ్యక్తి వల్ల ప్రమాదంలో ఇరుక్కుంటే కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఇంతకీ ఎవరామె? హీరోకి చెల్లెలా? మేనత్త కూతురా? రెండూ కాదా? ఇంతకీ లింగం ఎవరు? ఈ ప్రశ్నలతో సినిమా చివరిదాకా చూడాలి.

ఈ తరహా కథలు అరవ తెర మీద కోకొల్లలుగా వచ్చాయి. కథ ఏదైనా, సినిమా నిలబడినా పడుకున్నా దానికి ప్రధాన కారణం కథనమే. కనుక కథ సంగతి పక్కన పెట్టి కథనం ఎలా ఉందని అడిగితే, అరవ అతితో కూడిన చల్లారిపోయిన సాంబారు మాదిరిగా ఉంది.

ఈ కథని దర్శకుడు మటన్ షాపులో కూర్చుని రాసుకున్నాడో ఏమో…అన్నీ నరుక్కోవడాలే చూపించాడు. అది కూడా కాళ్లు, వేళ్లు, చేతులు, తల, మొండెం ఇలా సకల పార్టులూ ముక్కలుగొట్టి తెర మీద పరిచాడు. సెన్సారు వారు మాత్రం అక్కడక్కడ బ్లర్ చేసి “తప్పదు.. చూడలేకపోతే కళ్లు మూసుకోండి..” అన్నట్టుగా వదిలేసారు.

కథనం అటు ఇటుగా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటే చతికిలబడే సినిమా కూడా ఓపిక చేసుకుని నిలబడుతుంది. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ కనుక ఆ రకంగా ఏమైనా సహాయపడ్డాడా అంటే అదీ లేదు. ఇంతటి నాసిరకం మ్యూజిక్ దేవీ శ్రీ ప్రసాద్ నుంచి రావడం బాధాకరం. “రంగస్థలం”, “పుష్ప” లాంటి సినిమాలకి సంగీతాన్ని అందించిన దర్శకుడే దీనికీ అందించాడంటే నమ్మలేం. అంటే ఆ ఘనత సుకుమార్ దే తప్ప దేవీది కాదని అర్ధం చేసుకోవాలేమో.

పాటల విషయానికొస్తే రెండు మూడు పాటల్లో శ్రీమణి సాహిత్యం బాగుంది. “ప్రాణంలో ప్రాణం నువ్వేనా! నే చూసేదంతా నిజమేనా!!..”, “చెబుతావా ఈ సాయం ఎందుకో…” పాటల్లోని పంక్తులు సందర్భోచితంగా బాగున్నాయి. కానీ ట్యూన్, ఆర్కెస్ట్రా యావరేజ్ గా ఉండడం వల్ల ఆ పాటలేవీ మనసులో మార్మోగకుండా అక్కడికక్కడే మర్చిపోయేలా తయారయ్యాయి.

తారాగణం విషయాని కొస్తే విశాల్ నటన ఎప్పటిలాగానే మాస్ మసాలాగా ఉంది. కానీ అతని యాక్షన్లోనూ, లుక్కులోనూ ఉన్న డెప్త్ తన వాయిస్ లో ఉండదు. అదొక మైనస్.

హీరోయిన్ ప్రియ భవాని శంకర్ చూడ్డానికి బాగుంది. పాత్రకి తగ్గ రూపమామెది. ఈ మధ్యన గోపిచంద్ పక్కన “భీమ”లో కనపడింది.

యోగి బాబు ఉన్నా కమ్మెడీ పెద్దగా చేసింది లేదు. హీరోకి సైడ్ కిక్ లా ఉన్నాడంతే.

మురళిశర్మ ఇంట్రో సీన్, కొన్ని బిల్డప్ ఎలివేషన్లు బాగున్నాయి. కానీ ఓవరాల్ గా ఈ పాత్రని మలిచిన తీరు కూడా రొట్టకొట్టుడుగానే ఉంది.

సముద్రఖని జస్ట్ ఓకే. తన పాత్రలో కూడా చెప్పుకోదగ్గ ఇంటెన్సిటీ ఏమీ లేదు.

అసలీ సినిమా ఇంటర్వల్ అయ్యేటప్పటికే ఒకటిన్నర సినిమా చూసినంత నీరసం వస్తుంది. మరో సగం చూడాలంటే మరో జన్మ ఎత్తినంత పని ప్రేక్షకులకి.

సత్ప్రవర్తనకి మెచ్చి ఖైదీలని శిక్షాకాలం పూర్తికావడానికంటే ముందే విడుదల చేసినట్టు, హాలు వారు కూడా సినిమా పూర్తవడానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందనగానే లైట్లేసేసి ప్రేక్షకులని విడుదలవ్వమని సంకేతాలిచ్చారు. అలా ముందుగానే వెళ్లిపోయినవాళ్లు ఉన్నారు.

ఇంతకీ రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుంది అని అడిగాడట ఒకడు. అలాగే ఈ సినిమా పూర్తిగా చూసినా కూడా చాలామందికి మెదిలే ప్రశ్న- “హీరో హీరోయిన్ కి ఏమౌతాడు?”. దానికి కారణం దర్శకుడు స్పష్టంగా చెప్పలేకపోయాడా, లేక ప్రేక్షకులే సరిగా అర్ధం చేసుకోలేకపోయారా? సమాధానంగా ఏదైనా చెప్పుకోవచ్చు.

ఎంత ప్రయత్నించినా రంగురాయి రత్నం కాదు. అలాగే “రత్నం” అని టైటిల్లో ఉన్నంత మాత్రాన కంకరరాయి లాంటి కథ రత్నమైపోదు. పైన చెప్పుకున్నట్టు కథ, కథనం ఇలా అన్ని విషయాల్లోనూ ఈ సినిమా ఒక చాల్లారిపోయిన అరవ సాంబారు.

బాటం లైన్: రత్నం కాదు రాయి