ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పాడంటే, చేస్తాడనే నమ్మకాన్ని సంపాదించారు. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి ప్రకటించే మేనిఫెస్టోపై ఇటు సొంత పార్టీ, అటు కూటమి నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగింపు సభలో మేనిఫెస్టోపై పరోక్షంగా జగన్ సంకేతాలు ఇచ్చారు. చేయగలిగేవే చెబుతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మేనిఫెస్టోలో ఏముంటాయనే చర్చకు తెరలేచింది. ప్రభుత్వ, అధికార పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు… రైతు రుణమాఫీ సాధ్యాసాధ్యాలపై జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నిజానికి రుణమాఫీ అనే అంశానికి జగన్ వ్యతిరేకం. అందుకే 2014 ఎన్నికల సందర్భంలో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తే, తప్పకుండా అధికారంలోకి వస్తామని సొంత పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చినా, ఆచరణ సాధ్యం కానివి చెప్పలేనన్నారు.
చివరికి జగన్ చెప్పిందే నిజమైంది. చంద్రబాబునాయుడు రైతు రుణమాఫీ హామీ ఇచ్చి, చెప్పిన ప్రకారం చేయలేక కర్షకుల వ్యతిరేకతను రుచి చూశారు. అందుకే చంద్రబాబు హామీలకు విశ్వసనీయత లేకుండా పోయింది. ఓట్లు వేయించుకోడానికి చంద్రబాబు ఉత్తుత్తి హామీలు ఇస్తుంటారనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలో సైతం బలపడింది.
ఈ నేపథ్యంలో జగన్ తన పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చారు. తాజా మేనిఫెస్టోపై అందుకు అందరి దృష్టి. రైతు రుణమాఫీ ప్రకటిస్తే మాత్రం… వైసీపీ మరోసారి ఊహించని సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నేతలు, అలాగే రైతాంగం నుంచి ఒత్తిడి నేపథ్యంలో రుణమాఫీపై జగన్ కీలక హామీ ఇస్తారా? అనే చర్చకు తెరలేచింది. ఈ ఒక్క హామీ ఇస్తే మాత్రం కూటమి కనుచూపు మేరలో కనిపించదని అధికార పార్టీ విశ్వాసం. మేనిఫెస్టోలో ఏముందో తెలుసుకోడానికి సూర్యోదయం కోసం వేచి చూడాలి.