సీనియర్ హీరో వెంకటేష్ రాజకీయాలకు దూరంగా వుంటారు. ఆ మాటకు వస్తే రామానాయుడు ఎంపీగా వున్నపుడు తప్పించి, మిగిలిన టైమ్ లో రాజకీయాలకు దూరంగా వుంటూనే వస్తున్నారు. అయితే ఈ సారి రెండు చోట్ల విక్టరీ వెంకటేష్ ప్రచారం సాగించక తప్పదు. బంధాలు, బాంధవ్యాల కారణంగా ఎన్నికల ప్రచారంలోకి వెంకటేష్ దిగబోతున్నారని తెలుస్తోంది.
ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి కుమారుడు విక్టరీ వెంకటేష్ అల్లుడు. అంటే వెంకీకి ఆ అభ్యర్థి వియ్యంకుడు అన్నమాట. అందువల్ల తప్పని సరిగా ఓ రోజు అయినా ప్రచారం చేయాల్సిందే. రఘురామ్ రెడ్డి కేవలం వెంకీ కే కాదు, రాష్ట్ర మంత్రి పొంగులేటికి కూడా వియ్యంకుడే.
ఇదిలా వుంటే ఆంధ్రలోని కైకలూరు నుంచి పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాస్ కు కూడా వెంకీ ప్రచారం చేయాల్సి వుంది. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ చాలా దగ్గర బంధువు. వెంకీ భార్యకు స్వయానా మేనమామ. పైగా దగ్గుబాటి కుటుంబానికి అన్ని విధాలా అండ దండగా వుంటున్నారు. సో, అక్కడ కూడా ప్రచారం చేయాల్సిందే.
ఖమ్మంలో కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పాలి. కైకలూరులో తెలుగుదేశం కూటమికి ఓటేయమని చెప్పాలి. అయితే ఇక్కడ పార్టీలను ప్రస్తావించకుండా, కేవలం అభ్యర్ధుల మంచి గురించి చెప్పి ఓట్లు అడిగే అవకాశం వుంది.