ఆంధ్ర సర్వేల గురించి, సీట్ల సంఖ్యపై వినవస్తున్న ఊహాగానాల గురించి నా అభిప్రాయం చెప్పడానికై యిది రాస్తున్నాను. ఫలితాల గురించి నేనేమీ చెప్పటం లేదు. తెలంగాణ ఫలితాలను నేను సరిగ్గా ఊహించలేక పోయానని పాఠకులకు మరొక్కమారు గుర్తు చేస్తున్నాను. అప్పట్లో సర్వేలన్నీ కాంగ్రెసు అద్భుతమైన మెజారిటీ గెలుస్తుందనే వేవ్ క్రియేట్ చేశాయి. ఎన్నికలకు నెలన్నర ముందు పబ్లిక్ మూడ్ మారేందుకు దోహదపడ్డాయి. ఆ సర్వేలు అశాస్త్రీయంగా ఉన్నాయనే చికాకుతో నేను అలా ఎలా అవుతుంది? అంటూ తెరాసయే మళ్లీ గెలుస్తుంది అని గెస్ చేశాను. ఇది ఉత్తి గెస్సే తప్ప సర్వేలు ఏమీ చేయలేదు అని కూడా స్పష్టం చేశాను. నిజానికి తెరాస పాలనలో జరిగిన అనేక నెగటివ్ అంశాలు మీడియాలో రాకపోవడం చేత నాకు తెలియను కూడా తెలియలేదు.
‘మీరు యింట్లో కూర్చుని, పేపర్లు చదివి గెస్ చేస్తే ఎలా? బయటకు వెళ్లి టీస్టాల్ వాడితో మాట్లాడితే పబ్లిక్ మూడ్ తెలిసిపోయేది’ అంటూ కొందరు సలహాలిచ్చారు. ఓటర్ల అభిప్రాయం, సినీ ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. సులభమైతే ఏ పార్టీ ఓడిపోదు, ఏ సినిమా ఫెయిలవదు. అంతెందుకు, తెలంగాణ ఫలితాలు వస్తూండగా రేవంత్ తమకు 80 సీట్లు వస్తాయని ఛాలెంజ్ చేశాడు, కోమటిరెడ్డి అయితే 80కి తగ్గితే రాజకీయాల్లోంచి తప్పుకుంటానన్నాడు. అంటే ఏ మేరకు గెలుస్తామో వాళ్లకీ అందాజా లేనట్లేగా! ఇక మనబోటి వాళ్లకు ఎలా తెలుస్తుంది? రోడ్డు మీద మనకు తగిలే వ్యక్తి ఎలాటివాడో, ఏ పార్టీ అభిమానో ఎవరికి తెలుసు? ‘రజకుడి మాటే జనవాక్యమ్మని అనుట న్యాయమా, రఘోత్తమా?’ అన్నట్లు ఆ వ్యక్తి ఆ ఊరి ప్రజలందరికీ, ఆ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతినిథి అని తీర్మానించ గలమా? అతని యింట్లో వాళ్లే అతనికి భిన్నంగా ఓటేయవచ్చు.
ఇటీవలి కాలంలో ట్రెండ్ ఏమిటంటే – ఓటర్లు తమ మనసులో మాట చెప్పటం లేదు. ‘ఫలానా పార్టీ నెగ్గుతుందని పేపర్లో రాస్తున్నారండి, అనుకుంటున్నారండి’ అని చెప్తాడు. తక్కినవారి మాట ఎందుకు? నీ ఓటు ఎవరికి? అని అడిగితే సమాధానం రాదు. వేరే ఊళ్లో వారికి ఫోన్ చేసి అడిగినా మనం పేపర్లో, టీవీలో చూసినదే అతనూ చెప్తున్నాడు. అందుకే మీడియాకు బలం అంతలా పెరిగింది. నిజానికి తెరాస విషయంలో అది పారిశ్రామికంగా, ఇరిగేషన్ పరంగా చేసిన అభివృద్ధి కనబడింది కాబట్టే నగరవాసులు దానికి ఓటేశారు. అవినీతి ఉందని తెలుసు కానీ ఏ మేరకు జరిగింది అనేది మీడియాలో రానీయలేదు కాబట్టి తెలియలేదు. అవినీతి దుష్ఫలితాలు గ్రామీణ ప్రజలు అనుభవించారు కాబట్టి వారికి తెలిసింది. 10 లక్షల మందికి రేషన్ కార్డులు యివ్వలేదని, ధరణి పోర్టల్ అస్తవ్యస్తతను అడ్డు పెట్టుకుని భూములు కాజేశారని యివన్నీ ముందే తెలిస్తే నా బోటి నగరవాసులు మరోలా ఓటు వేసేవారు. ఏ నియోజక వర్గంలోనైనా సరే, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసున్న వారు తమ సంతృప్తిని లేదా అసంతృప్తిని ఓటు ద్వారా వెలిబుచ్చుతున్నారు. ఈ లోగా ఎవరైనా అడిగితే గోప్యత పాటిస్తున్నారు.
పైగా ప్రజలు తెలివి మీరారు. చెప్తే నాకేం వస్తుంది? నాకేంటంట? అనే భావనతో పాటు ‘చెప్తే ఏం ముప్పో’ అనే భయం కూడా ఉండవచ్చు. మనసులో ఉన్నది మనకు చెప్పాలన్న ఆబ్లిగేషన్ ఏమీ లేదు కదా. ఈ మధ్యే ఓ వీడియో చూశాను. ఓ వైజాగ్ వాసిని ఓ యూట్యూబు ఛానెలతను ఎవరికి ఓటేస్తారని అడిగాడు. ఆయన నువ్వెవరికి వేస్తావని అడిగాడు. ఛానెలతను ‘జగన్‌కి’ అన్నాడు. అంతే, ఆయన తిట్లు లంకించుకున్నాడు. ‘నువ్వు నాశనమై పోతావు, నీ పిల్లలు నాశనమై పోతారు. నీ కుటుంబం నాశనమై పోతుంది’ అంటూ మూడు నిమిషాలకోసారి శాపనార్థాలు పెట్టాడు. ఇంకో సందర్భంలో ఛానెలతను జవాబిచ్చిన వాణ్ని తిట్టి ఉంటే? ఎందుకొచ్చిన గొడవ అని చాలామంది ‘ఎవరికి ఓటేయాలో ఆలోచించాలండి’ అని తప్పించుకోవచ్చు. అందువలన ఓటరు మనసులోని మాటను రాబట్టడం సాధారణ విద్య కాదు. సర్వే కంపెనీల వాళ్లు స్టాఫ్‌కి బాగా తర్ఫీదు యిచ్చి పంపుతారనుకుంటా. అయినా ఓటర్లు వాళ్లని ఔట్‌స్మార్ట్ చేయ గలుగుతున్నారు కాబట్టే అనేక సర్వేల అంచనాలు తప్పుతున్నాయి.
ఆంధ్ర ఎన్నికల విషయానికి వస్తే, యింత ముందుగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో నిర్ధారణగా చెప్పడం కష్టమని అందరికీ తెలుసు కానీ వారానికి రెండు చొప్పున సర్వే ఫలితాలు రావడం, వాటిపై విశ్లేషణలు వినిపించడం యూట్యూబర్లకు వ్యాపకమై పోయింది. ఎప్పుడూ ఒకేలా చెప్తే శ్రోతలు వినరని, ఓ రోజు కూటమికి మొగ్గు ఉందని, మరో రోజు వైసిపికి మొగ్గు ఉందని, మూడో రోజు పరిస్థితి పోటాపోటీగా ఉందని ఏదో ఒకటి చెప్తూ మనకు ఆసక్తి పోకుండా చూస్తూన్నారు. ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని మార్చగానే దానిపైనే మొత్తం రాష్ట్రం రిజల్టు మారిపోతుందన్నంత బిల్డప్ యిస్తున్నారు. అందుచేత యివన్నీ సీరియస్‌గా పట్టించుకోవడంపై నాకుండే అనుమానాలు నాకున్నాయి.
కొంతమంది సస్పెన్స్ మేన్‌టేన్ చేయడానికి పోటీ తీవ్రంగా ఉందని చెప్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ ఎవరూ హంగ్ అసెంబ్లీ వస్తుందని చెప్పటం లేదు. తెలుగు రాష్ట్రాలలో అలాటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నెగ్గే పార్టీకి ఎప్పుడూ క్లియర్ మెజారిటీయే వస్తోంది. అయితే ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా, కులాల వారీగా నియోజక వర్గాలు కూటమికి, వైసిపికి మధ్య చీలిపోవడంతో నెగ్గే పక్షానికి 115, ఓడే పక్షానికి 60 వస్తాయని ఒక సేఫ్ బెట్‌గా చెప్తున్నారు. ఏది నెగ్గేది, ఏది ఓడేది అనేది సర్వే సంస్థ బట్టి మారిపోతోంది. అసలు కీలకమంతా తటస్థ ఓటర్లలో ఉంది. వారి శాతం ఎంత అనే దానిపై వివిధ సర్వేలు రకరకాల అంకెలు చెప్తున్నాయి. 2 నుంచి 8 దాకా అంకెలు విన్నాను. వీళ్ల మీదే ఫలితం ఆధారపడుతుందని అనుకోవాలి. వైసిపి, కూటమి బలాలు సమానంగా ఉన్నపుడు వీరు ఎవరివైపు తులసిదళం వేస్తే ఆ పక్షం నెగ్గుతుంది.
వైసిపికి 43% నికరమైన ఓటు ఉందనుకోవచ్చు. 2019 ఎన్నికల్లో అది 50% తెచ్చుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత వలన దాని కంటె యిప్పుడు తగ్గుతుందని అనుకోవాలి. ఇక కూటమి విషయానికి వస్తే టిడిపి 2019లో 39.2% తెచ్చుకుంది జనసేనకు 5.5% వచ్చాయి కానీ 137 స్థానాల్లో నిలబడితే ఆ శాతం వచ్చింది. ఇప్పుడు దానిలో 15% సీట్లలో నిలబడుతోంది, కానీ బలం ఉన్న చోటే నిలబడుతోంది. బిజెపికి 1% కంటె తక్కువ వచ్చాయి. అందువలన కూటమికీ కనీసం 43% నికరమైన ఓటు ఉందనవచ్చు. ఈ లెక్కలు రాష్ట్రమంతా ఒకేలా ఉంటాయని అనుకోవడానికి లేదు. కోస్తాలో కూటమికి, రాయలసీమలో వైసిపికి, పట్టణ ప్రాంతాల్లో కూటమికి, గ్రామీణ ప్రాంతాల్లో వైసిపికి, ఎగువ, మధ్యతరగతి ప్రజల్లో కూటమికి, దిగువ తరగతిలో వైసిపికి పట్టు ఉంటుంది కాబట్టి నియోజక వర్గాల వారీగా ఫలితాలు మారవచ్చు.
2019లో ఏ పార్టీకి ఆ పార్టీ విడిగా పోటీ చేయడంతో వైసిపి వెల్లువ వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏకం కావడం చేత, ఐదేళ్లగా పాలిస్తున్న ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చేత అలాటి వెల్లువ రాదని అనుకోవడం సమంజసం. తన హయాంలో వచ్చిన పరిశ్రమలు, అభివృద్ధి (చాలానే జరిగిందని కొందరు గణాంకాలు వల్లిస్తున్నారు) గురించి అస్సలు మాట్లాడకుండా ఎప్పుడు చూసినా సంక్షేమాన్నే ఫోకస్ చేస్తూ ‘మీ కుటుంబంలో ఎవరికైనా మేలు జరిగితేనే మీ బిడ్డకు ఓటేయండి’ అనే జగన్ నినాదాన్ని సీరియస్‌గా తీసుకుంటే పథకాల లబ్ధిదారులు మాత్రమే వైసిపికి ఓటేస్తారు, ఏ పథకాలూ పొందని వారు వేయనే వేయరు. ఎంతైనా సమాజాన్ని వర్గాల వారీగా విడగొట్టి దాని సంఖ్యాబలం బట్టి అంచనాలు వేయడం కూడా సరి కాదు. ఆ వర్గాల్లోని వారు ఏ మేరకు ఓటింగులో పాల్గొంటారనే దానిపై కూడా ఫలితాలు ఆధారపడతాయి.
లబ్ధిదారులు విరగబడి బూత్‌లకు వెళ్లి, లబ్ధిదారులు కానివారు యింట్లోనే సాగిలబడి, గుమ్మం కదలకపోతే అంచనాలు తారుమారవుతాయి. ఆరు రోజుల క్రితం తమిళనాడులో జరిగిన ఎన్నికలలో ధర్మపురి జిల్లాలో 81% ఓటింగు జరిగితే చెన్నయ్‌లో 54% జరిగింది. చూడండి ఎంత వ్యత్యాసమో! ఇలాటప్పుడు ఏ పార్టీకైనా యిన్ని సీట్లు వస్తాయి అని కరక్టుగా చెప్పడం సాధ్యమా? ఓటింగు శాతం పెరిగితే అధికార పార్టీకి లాభమా? నష్టమా? అనే దానిపై కూడా వేర్వేరుగా చెప్తూ ఉంటారు. 2019 ఎన్నికలలో మహిళలు క్యూలో గంటల తరబడి వెయిట్ చేస్తే, పోలింగు సమయాన్ని కూడా పొడిగించాల్సి వచ్చింది. ‘పసుపు కుంకుమ’ స్కీము కారణంగా మహిళలు ఉధృతంగా టిడిపి పక్షాన ఓటేశారని అందరూ అనుకున్నారు. జెసి దివాకర రెడ్డి అయితే తనకు టిడిపి గెలుపుపై అనుమానం ఉండిందని, కానీ మహిళలు రాత్రి ఏడు గంటలదాకా నిలబడి ఓటేయడంతో అది పటాపంచలయిందని అన్నారు. తీరా ఫలితాలు చూస్తే ఆ మహిళలు చంద్రబాబును ఓడించాలనే పట్టుదలతో అంతసేపు నిలబడ్డారని అనిపించింది.
సర్వే చేసే వాళ్లు చెప్పే అంకెలు కామన్‌సెన్స్‌తో చెప్తున్నట్లు అనిపిస్తోంది. కూటమి పక్షాల మధ్య ఓట్ల బదిలీ, అభ్యర్థి ఆమోదయోగ్యత వంటి కొన్ని ఇంపాండరబుల్ ఫ్యాక్టర్లున్నాయని గ్రహిస్తే వాటిని ఏ మేరకు తీసుకోవచ్చో మనకు అర్థమౌతుంది. ‘జగన్ పట్ల అనేకులు వ్యతిరేకంగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఓడిద్దామాని చూస్తున్నారు’ వంటి కబుర్లు ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా, ఎన్నో కసరత్తులు చేసి, ఎంతో కష్టపడి, యింకెంతో రాజీ పడి కూటమి కట్టడంలోనే తెలుస్తోంది, జగన్ ఒక ఫర్మిడబుల్ ఫోర్స్ అని! కూటమి కట్టాక కూడా ఓట్ల బదిలీ జరగకపోతే 2019లో లాగ ఎవరికి వారే పోటీ చేసినట్లవుతుంది. అప్పుడు ఏం జరిగిందో చూశారు కాబట్టి, కష్టపడి కూటమి కట్టారు.
ఓట్ల బదిలీ ఫ్యాక్టర్ – టిడిపి, బిజెపి మధ్య ఓట్ల బదిలీ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే యిద్దరి ఓటు బ్యాంకులూ అగ్రవర్ణాలు, అగ్ర వర్గాలు, మధ్యతరగతి కాబట్టి! వీరిలో వైసిపి అభిమానులు తక్కువ. అయితే యీ బదిలీ కూడా 100% జరుగుతుందని గ్యారంటీ లేదు. వైసిపికి పరోక్షంగా మద్దతిస్తోందని, బాబుని జైల్లో పెట్టడానికి సహకరించిందని బిజెపిపై టిడిపి వారికి అలక ఉంది. అలాగే పేరుకి బిజెపి కాండిడేటే కానీ వస్తుతః టిడిపి మనుషుల్నే నిలబెట్టారని సాంప్రదాయక బిజెపి ఓటరుకి గునుపు ఉంది. పరిస్థితి ఎలా ఉందంటే కూటమి తరఫున పోటీ చేసేవారిలో బాబు మనుషులు కాని వారు 15 మందికి లోపే ఉంటారు. తక్కిన వారందరూ ఆయన వారే! ఆయన వచ్చి ఏ కండువా కప్పితే, ఆ పార్టీ వారవుతారు.
విఠలాచార్య సినిమాలో కుక్క వేషంలో యుద్ధం చేసే విలన్ క్షణాల్లో నక్క అయిపోతాడు, మరో ఫ్రేమ్ వచ్చేసరికి పిల్లి అవుతాడు, దానితో పోట్లాడే హీరో తదనుగుణంగా రకరకాల జంతువులుగా మారిపోతూ ఉంటాడు. ప్రస్తుతం కూటమి అభ్యర్థి యివాళ టిడిపి అంటాడు, మర్నాడు అబ్బే జనసేన వాణ్ని అంటాడు. మరో ఊళ్లో టిడిపి అభ్యర్థి రాత్రికి రాత్రి బిజెపి అభ్యర్థిగా అవతారమెత్తుతాడు. ఈ ప్రహసనం బిజెపి అభిమాన ఓటర్లకే కాదు, ఒరిజినల్ బిజెపి నాయకులకూ మంట తెప్పిస్తోంది. అందుకే వారంతా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ పురంధేశ్వరి ఏం చేసి చూపిస్తుందో మనమూ చూదాం అన్నట్లు గట్టు మీద కూర్చుని వేడుక చూస్తున్నారు. అందువలన యీ ఎన్నికలలో బిజెపి పేర నిలబడ్డ వారిని గెలిపించే బాధ్యత కూడా బాబు నెత్తినే పడింది. లేకపోతే తమకు అనుకూలమైన పురంధేశ్వరి పదవికి ఎసరు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
కూటమిలోకి బిజెపి వస్తే పెనుమార్పు వస్తుంది అని పరిశీలకులు చాలా అంచనాలు వేయడం జరిగింది. కానీ మార్పులేవీ కనబడటం లేదు. మోదీ-అమిత్ యితర రాష్ట్రాలలో తమ తడాఖా చూపించినా ఆంధ్ర వరకు వచ్చేసరికి పార్టీని బాబు యిష్టాయిష్టాలకు వదిలేసి, ఎన్ని సీట్లు వస్తే అన్ని రానీ అనుకుంటున్నట్లు కనబడుతోంది. ఏదో నరసాపురం పార్లమెంటు సీటు విషయంలో మాత్రమే రఘురామ యిమేజి కారణంగానో ఏమో, కుదరదు అని గట్టిగా చెప్పారు. కేంద్రం నుంచి జగన్‌కు ఎడాపెడా మొట్టికాయలు పడిపోతాయనుకుంటే అలాటిదేమీ కనబడలేదు యిప్పటిదాకా. జగన్ సమర్థకులపై ఐటీ, ఇడి దాడులు జరుగుతాయనుకుంటే అవీ జరిగినట్లు లేవు. జగన్ కేసుల గొంగళీ, వివేకా హత్య గొంగళీ ఎక్కడివక్కడే ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్లపై బిజెపి కేంద్ర నాయకులు మాట్లాడి, టిడిపిని యిరకాటంలోకి నెడుతున్నారు. దాన్ని ఉమ్మడి ప్రణాళికలో పెట్టమంటే టిడిపి మరింత వణుకుతుంది. ఇవన్నీ చూస్తే, బిజెపి-వైసిపి రహస్యబంధం సాగుతోందాన్న అనుమానం వైసిపి ఓటరుకే కాదు, టిడిపి ఓటరుకూ కలుగుతోంది.
జనసేన-బిజెపి మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా అనే దానిపై ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. వారిద్దరి మధ్య పెద్ద స్నేహమూ లేదు, వైరుధ్యమూ లేదు. ఇక జనసేన-టిడిపి మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా అనేది కోస్తా జిల్లాలలో ప్రభావం కలిగించి, ఫలితాలను మార్చే అంశం. 2019 ఎన్నికలలో ఓట్లు తెచ్చుకున్న శాతాలు అలాగే స్థిరంగా ఉన్నాయనుకుంటే, మూడు జిల్లాలలో వీరిద్దరి ఓట్ల శాతం వైసిపి కంటె ఎక్కువ. కానీ జనసైనికుడి అప్పటి భావాలు వేరు, యిప్పటి భావాలు వేరు. 2019లో పవన్ సభల్లో సిఎం, సిఎం అని అరిచినా, అతను కనీసం కింగ్‌మేకరు అవుతాడని, బాబు ప్రభుత్వం నిలబెట్టడానికి పవన్ అవసరం పడుతుందనే ఆశ వారిలో ఉండి జనసేనకు ఓటేశారు. కానీ బాబుకి పవన్ అవసరం పడలేదు. పడి ఉన్నా, ఆదుకునే సత్తా పవన్‌కు లేకుండా పోయింది.
ఇప్పుడు పవన్ కూటమిలో భాగస్వామిగా పోటీ చేస్తున్నాడు. ఏ 50 టిక్కెట్లో తీసుకుని ఉంటే కింగ్ మేకర్ అయ్యేవాడు అనే ఆశ జనసైనికుల్లో ఉంది. కానీ పంచపాండవులంటే మంచం కోళ్లలా.. అనే సామెతలా 50, 24 అయింది, ఆపై 21 అయింది. దానిలో కూడా సగం మంది టిడిపి వాళ్లే అయ్యారు. దాంతో పవన్ కింగ్‌మేకరైనా కాబోడు అని తెలిసిపోయింది. ఈ పరిస్థితితో పవన్‌కు పేచీ లేదు కానీ జనసైనికుడికి ఆశాభంగం కలిగింది. మన వాడు కింగ్ కాడు, కింగ్ మేకర్ కాడు, మహా అయితే తను నెగ్గి అసెంబ్లీకి వెళతాడు, తన వెనక ఉన్న పదిమందీ తనవాళ్లో కాదో తెలియని పరిస్థితిలో ఉంటాడు అనిపించినప్పుడు జనసేనకే ఓటేయాలనే తాపత్రయం అతనికి ఉంటుందా?
జనసేన 21 సీట్లు మాత్రమే తీసుకోవడంలో, ప్రతీ దానికీ టిడిపిపై ఆధారపడడంలో ప్రాక్టికల్ ఎప్రోచ్ ఉందని పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. 2019లో అనగా ఐదేళ్ల క్రితం యిప్పుడున్న దాని కంటె ఘోరంగా ఉండింది పరిస్థితి. అయినా తను సిఎం అవుతాడని ఆయన కొందర్ని నమ్మించాడు. అందుకే ఓట్లు ఆ స్థాయిలో పడ్డాయి. 2024 వచ్చేసరికి వాస్తవ పరిస్థితి ఏమిటో ఆయనకీ, జనసైనికులకూ తేటతెల్లం అయిపోయింది. ఎవరైనా మందబుద్ధు లుంటారేమోనని ఏ నాయకుడూ చెప్పని రీతిలో ఆయనే పదేపదే సభల్లో చెప్పాడు – మనకు అది లేదు, యిది లేదు, ఏదీ లేదు, పార్టీ నిర్మాణం లేదు, నాయకులు లేరు, నా దగ్గర డబ్బు లేదు, డబ్బిచ్చేవాళ్లు లేరు. గతంలో నాకు ఏ 30 సీట్లో మీరిచ్చి వుంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రస్తుతానికి ఒంటరిగా వెళితే పచ్చడై పోతాం. వీరమరణం పొందుతాం అని.
ఇవన్నీ విన్నాక జనసేన అభిమానులకు స్పష్టమైన అవగాహన ఏర్పడకుండా ఉంటుందా?. పవన్‌కున్న సొంత బలం చాలదు, ప్రతిదానికీ చంద్రబాబుపై ఆధారపడాల్సిందే. కూటమి అధికారంలోకి వస్తే బాబు పాలనే సాగుతుంది. బహుశా పది సీట్లు మాత్రమే గెలిచే జనసేన తన సిద్ధాంతాలను పట్టుబట్టి టిడిపి చేత అమలు చేయించే స్థితిలో ఉండదు అని. ఈ అవగాహన కలిగిన జనసేన పార్టీ ఓటర్ల ఓట్లు 2019 స్థాయిలో జనసేనకూ, జనసేన మద్దతిస్తున్న కూటమి భాగస్వాములకూ పడతాయా లేదా అన్నదే ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్న. కుల, మతపరమైన ఓట్ల గురించి మాట్లాడాలంటే, కేవలం సాటి కాపు కదాని కాపులు పవన్‌కు, సాటి క్రైస్తవురాలు కదాని క్రైస్తవులు షర్మిలకూ ఓట్లు వేయరు. అధికారంలోకి రాగలుగుతారా లేదా, వస్తే మనకేం చేస్తారు? అనే లెక్కే బలంగా పని చేస్తుంది.
మరొక ఇంపాండరబుల్ పాయింటేమిటంటే అభ్యర్థి ఆమోదయోగ్యత. ఇంతకుముందు ఎన్నడూ జరగనంత స్థాయిలో అభ్యర్థుల మార్పు జరిగింది. వైసిపి 90 మందిని మార్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులయ్యారు, ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులయ్యారు. ఒక ప్రాంతం వాళ్లని మరో ప్రాంతంలో అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అలాగే కూటమిలో కూడా అభ్యర్థుల ఎంపికలో పెనుమార్పులు జరిగాయి. కొన్ని సీట్లలో టిక్కెట్టు దక్కే పార్టీ ఏదో, అభ్యర్థి ఎవరో తెలియని గందరగోళం వచ్చింది. ఒక పార్టీ నాయకుడు నిమిషాల్లో కూటమి లోని వేరే పార్టీకి వెళ్లి అభ్యర్థి అయిపోయిన విచిత్ర పరిస్థితి వచ్చింది. పేకముక్కలు షఫుల్ చేసినట్లు పార్టీలు అభ్యర్థులను అటూయిటూ చేసేస్తున్నారు. ఎందుకు అని అడిగితే సర్వే చెప్పిందంటున్నారు. ప్రజలు యీ మార్పులను ఆమోదిస్తారా? అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు, అధినాయకుణ్ని చూసే ఓటేస్తారు అనే వాదన నేను ఒప్పుకోను. 2019 జగన్ వేవ్‌లో సైతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి సీనియర్ నాయకుడు ఓడిపోయాడు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో నేను కెసియార్‌పై ఎంత కోపం ఉన్నా, స్థానిక అభ్యర్థి పని తీరు చూసి తెరాసకు ఓటేశాను.
అప్పటిదాకా తమ నియోజకవర్గంలో పని చేయని వాణ్ని హఠాత్తుగా ఎక్కణ్నుంచో తెచ్చి, నా మొహం చూసి ఓటేయండి అంటే ప్రజలు ఆమోదిస్తారా? ఇలాటి ప్రయోగాలు, సగానికి సగం మంది అభ్యర్థులకు సీటు నిరాకరించడాలు వంటివి గతంలో జరిగి ఉంటే ఫలితాలపై ఒక ఐడియా ఉండేది. జరగలేదు కాబట్టి యీ ఫ్యాక్టర్‌కు వెయిటేజి ఎంత యివ్వాలో తెలియదు. ఇలాటి అసందిగ్ధ వాతావరణంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో గెస్ చేయడం మిడతం భొట్లు జోస్యం లాటిదే! ఎన్నికలు దగ్గర పడుతూంటే మరి కొన్ని పరిణామాలు జరిగి, అవీ ఓటింగు సరళిని ప్రభావితం చేయవచ్చు.
ఒక విషయం గమనించండి. టిడిపితో ఎంతో అనుబంధం ఉన్న తెలుగు సినిమా పరిశ్రమ కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ఉంది. టిడిపి డూ ఆర్ డై పోరాటం చేస్తోంది అని వార్తలు వస్తూన్న యీ వేళ, మామూలుగా అయితే అయితే వాళ్లు టిడిపి పక్షాన ప్రచారంలోకి దిగాలి. కానీ తీరా చేసి జగన్ గెలిస్తే..? అనే భయం వారిని నిలవరిస్తూన్నట్లుంది. అందుకే ఒక సినిమా నటుడు కూటమి భాగస్వామి పక్షానికి అధ్యక్షుడైనా ఎవరూ అరుగు దిగి వాళ్ల పక్షాన మాట్లాడటం లేదు. ఇన్నాళ్లకు చిరంజీవి ఒక్కరే దిగారు. బిజెపితో, పవన్‌తో ఆయనకు మొహమాటాలు ఉన్నాయని తెలుసు కాబట్టి చెల్లిపోయింది. తక్కినవాళ్లకు ఆ ధైర్యం చిక్కటం లేదు. సినిమా వాళ్లను చూసైనా మనం తమాయించు కుంటే మంచిది. ఫలానా వారికి యిన్ని సీట్లు వస్తాయి అని ఎవరైనా చెప్తే విని ఓహో అనేసి ఊరుకుంటే మేలు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2024)