మెగా కాంపౌండ్ మద్దతు ఎటువైపు అనేది తేలిపోయింది. అందరూ కాకపోయినా, కొంతమంది జనసేన-టీడీపీ కోసం రంగంలోకి దూకేలా ఉన్నారు. ఇక చిరంజీవి అయితే మోడీతో కలిసి ప్రచార సభలో పాల్గొంటారనే చర్చ నడుస్తోంది. అటు నిఖిల్ తన వాళ్ల కోసం ఆల్రెడీ ప్రచార రథం ఎక్కాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ సంగతేంటి?
ఏపీలో రాజకీయ వేడి పెరిగిన ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ అంశం తెరపైకొస్తుంది. ఆ మాటకొస్తే, పెద్దగా పొలిటికల్ హడావుడి లేని టైమ్ లో కూడా తారక్ తెరపైకొస్తుంటాడు. అలాంటిది ఈ ఎన్నికల వేళ రాకుండా ఉంటాడా? వచ్చాడు.. ఇక్కడే చాలా ట్విస్టులు.
ఎన్టీఆర్ తమ వాడంటే తమ వాడంటూ కొట్టుకుంటున్నారు కార్యకర్తలు. గుడివాడ, పెనమలూరులో వైసీపీ నిర్వహించిన నానినేషన్ ర్యాలీల్లో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, జై ఎన్టీఆర్ నినాదాలు వినిపించాయి. అదే టైమ్ లో టీడీపీ నిర్వహించిన సభలు, ర్యాలీల్లో ఎక్కడా ఎన్టీఆర్ ప్రస్తావన లేకపోవడం విశేషం.
ఒకప్పుడు ఎన్టీఆర్-కొడాలి నాని మధ్య మంచి స్నేహం ఉండేది. ఎప్పుడైతే కొడాలి నాని వైసీపీలోకి షిఫ్ట్ అయ్యారో, ఆ వెంటనే జూనియర్ ఎలర్ట్ అయ్యారు. కొడాలికి, తనకు మధ్య ఎలాంటి రాజకీయ సారూప్యత లేదని, తాత స్థాపించిన పార్టీలోనే ఉంటానని ప్రకటించారు.
అయితే ఆ ప్రకటన వచ్చిన తర్వాత చాలాసార్లు అవమానాలకు గురయ్యారు ఎన్టీఆర్. ఫ్యామిలీ ఫంక్షన్లలో తారక్ కు తగిన గుర్తింపు దక్కలేదు. ఓ వేదికపై స్వయంగా బాలకృష్ణ, తారక్ ను చూసిమరీ చూడనట్టు వెళ్లిపోవడం అందర్నీ బాధించింది. ఈ ఐదేళ్లలో ఇలాంటి అవమానాలెన్నో దిగమింగుకున్నాడు తారక్.
అదే టైమ్ లో రాజకీయాల పరంగా కూడా గుంభనంగా ఉన్నాడు. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చెలరేగిన టైమ్ లో కూడా పైపైన ప్రకటన చేసి ఊరుకున్నాడే తప్ప, ఓ నందమూరి కుటుంబ సభ్యుడిలా ఆయన రియాక్ట్ అయినట్టు కనిపించలేదు.
దీనికితోడు ఇప్పుడు కల్యాణ్ రామ్ కూడా తారక్ తో కలిశాడు. తామిద్దరం ప్రస్తుతానికి రాజకీయాలకు దూరమని, కల్యాణ్ రామ్ విస్పష్టంగా ప్రకటించాడు. ఎన్నికల టైమ్ లో ఎవరికి మద్దతివ్వాలనేది కుటుంబంతో కలిసి కూర్చొని చర్చించుకుంటామని అన్నాడు తప్ప, టీడీపీకే మద్దతని చెప్పలేకపోయాడు కల్యాణ్ రామ్.
సో.. ఒక విధంగా చూస్తే, ఎన్టీఆర్ వైసీపీ వైపే ఉన్నాడని కొడాలి నాని అనుచరులు చెప్పుకోవచ్చు. అదే టైమ్ లో తారక్ ఎప్పటికీ తాత స్థాపించిన పార్టీలోనే ఉంటాడని టీడీపీ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఎన్నికల వేళ తారక్ అందరికీ కావాలి, ఎన్నికల తర్వాత మాత్రం అతడికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వదు ఆయన తాత స్థాపించిన పార్టీ. అదే విచిత్రం. అందుకే ఈ వ్యూహాత్మక మౌనం.