లోక్‌సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా అత్యున్నత చట్టసభలో కనువిందైన దృశ్యం ఆవిష్కృతమైంది. స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓంబిర్లాను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన్ను స్పీకర్ స్థానంలో కూచోపెట్టేందుకు ప్రధాని మోదీ, అధికార పక్ష సభ్యులు, అలాగే కాంగ్రెస్ పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ బిర్లా వద్దకు వెళ్లారు.
ఓంబిర్లాను ప్రధాని అభినందించారు. ఇదే సందర్భంలో రాహుల్‌గాంధీ కూడా బిర్లాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రశంసించారు. అనంతరం ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ ఆప్యాయంగా కరచాలనం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య రాజకీయ విమర్శలు వాడి, వేడిగా సాగడం తెలిసిందే. అయితే ఇవన్నీ రాజకీయ విమర్శలుగానే ఇరుపక్షాల నేతలు చూస్తున్నారు.
కానీ ఏపీలో ఇలాంటి సీన్‌ను అసలు ఊహించుకోలేం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థులపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూస్తున్నాం. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో పాలన సాగించిందని, ఇప్పుడు తామేం తక్కువ అంటూ కూటమి కూడా దాన్నే ఆదర్శంగా తీసుకుంది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని రెండు గంటల్లోనే కూల్చివేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల నిర్మాణాలు, అనుమతులపై వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటికే చాలా కార్యాలయాకు నోటీసులు అంటించింది.
ఏపీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంలో ఆయన్ను గౌరవంగా స్పీకర్ స్థానంలో కూచో పెట్టే సమయంలో వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైంది. ఇక చంద్రబాబునాయుడు, జగన్ పరస్పరం కరచాలనం చేసుకునే పరిస్థితిని ఊహించలేం. పరస్పరం శత్రువులుగా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు చూసుకుంటున్నారు. లోక్‌సభలో ప్రధాని మోదీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ పరస్పరం కరచాలనం చేసుకోవడం చూసిన వారెవరికైనా, ఏపీలో కూడా ఇలా వుంటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన కలుగుతుంది. కానీ ఆ ఆశ నెరవేరే పరిస్థితి లేదు.