లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీతో పాటు పలు పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ఓం బిర్లా నేతృత్వంలోనే 17వ లోక్‌సభలో కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెట్టామని గుర్తు చేసుకున్నారు. గత ఐదేళ్లు సభను విజయవంతంగా నడిపించినట్టుగానే, రాబోయే ఐదేళ్లు కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపించాలని బిర్లాను ప్రధాని కోరారు.
రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కితే సభను సజావుగా నిర్వహించినట్టు కాదన్నారు. ప్రజల గొంతుకను ఎంత సమర్థవంతంగా వినిపించేందుకు అవకాశం ఇచ్చామన్నదే ముఖ్యమన్నారు.
వైసీపీ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లు సభను ఓంబిర్లా ఎంతో హుందాగా నడిపారని ప్రశంసించారు. ప్రజాస్వామ్య విలువల్ని ఓంబిర్లా నిలబెట్టారని మిథున్‌రెడ్డి కొనియాడారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు సభలో మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ కల్పించారన్నారు. ఇదే రీతిలో రానున్న కాలంలో బిర్లా వ్యవహరించాలని వైసీపీ పక్ష నేత ఆకాంక్షించారు.
ఏపీలో తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన ఎన్డీఏకి లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో వైసీపీ మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. మోదీ అధికారంలో వుండడంతో ప్రతిదానికీ వైసీపీ మద్దతుగా ఓటు వేయడం ఆనవాయితీగా వస్తోందన్న చర్చకు తెరలేచింది.