ప్రతిపక్ష హోదాపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరుకున్నట్టుగానే టీడీపీ స్పందించింది. తన పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారనే ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా ఇవ్వరేమో అని అనుమానిస్తూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి జగన్ లేఖ రాశారు. తక్కువ సీట్లు వచ్చినప్పటికీ, ఎప్పుడెప్పుడు, ఎవరెవరికి ప్రతిపక్ష హోదా దక్కిందో లేఖలో జగన్ పేర్కొన్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం వస్తుందని ఆయన తెలిపారు. కావున ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు.
జగన్ విన్నపంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించలేదు. కానీ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జగన్‌కు ప్రతిపక్ష హోదాను ప్రజలే ఇవ్వలేదని ఆయన అన్నారు. జగన్ ప్రతిపక్ష హోదాను తాము అడ్డుకోలేదని ఆయన చెప్పారు. కానీ ప్రజాతీర్పును జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని పయ్యావుల దెప్పి పొడిచారు. వైసీపీ ప్లోర్‌లీడర్ మాత్రమే అని జగన్ స్థానాన్ని ఆయన గుర్తు చేశారు.
స్పీకర్‌కు లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష హోదా దక్కదని ఆయన వెటకరించారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రావడానికి పదేళ్లు పట్టిందని, వైసీపీకి కూడా అన్నే సంవత్సరాలు ప్రతిపక్ష హోదా దక్కడానికి పడుతుందని సెటైర్ విసిరారు. జగన్ ఒకసారి రూల్ బుక్ చదువుకోవాలని హితవు చెప్పారు.
టీడీపీ నుంచి ఇలాంటి స్పందననే జగన్ కోరుకున్నారు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం జగన్‌కు ఏ మాత్రం లేదు. ఇందుకోసం ఒక సాకు కావాలి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించడాన్ని నిరసిస్తూ అసెంబ్లీకి వెళ్లనని జగన్ ప్రకటించే అవకాశం వుంది. అంతేకాకుండా తనను చచ్చే వరకూ కొట్టాలన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి వ్యక్తి స్పీకర్‌గా వుండగా, అసెంబ్లీకి వెళ్లినా ఉపయోగం లేదని ఇప్పటికే జగన్ అన్నారు.