కాంగ్రెస్ పార్టీలో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విన్నవించారు. ఈ మేరకు ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ సెక్రటరీకి ఈ-మెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇటీవల కాంగ్రెస్‌లో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిన సంగతి తెలిసిందే.
అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకటరావ్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార పార్టీలో చేరడం ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. చేరికలను నిరోధించడానికి బీఆర్ఎస్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు.
ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి తదితరులతో కేసీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లో చేరికలపై ఆయన చర్చించినట్టు సమాచారం. ఇదిలా వుండగా కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో వుండగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. అందుకే ఇప్పుడు ప్రశ్నించే నైతిక హక్కును బీఆర్ఎస్ కోల్పోయింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఎలాంటి దినానిర్దేశం చేస్తుందో చూడాలి. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాత్రం బీఆర్ఎస్ ఫిర్యాదులపై స్పందించే పరిస్థితి వుండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.