ఎవరినీ నమ్మకు, నిన్ను నువ్వు కూడా అన్నాడో వేదాంతవేత్త. ఇప్పుడదే జీవనశైలి. జేబులోనే అపనమ్మకాన్ని పెట్టుకుని తిరుగుతున్నాం. సెల్‌ఫోన్.
ప్రకృతి నుంచి అన్నీ తీసుకుంటాం. ఒక రోజు తిరిగి ఇస్తాం. మనల్ని మనమే ఇచ్చుకుంటాం. ఇచ్చి పుచ్చుకోవడం ప్రాకృతిక ధర్మం. రాజకీయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ధర్మాన్ని అనాది నుంచి పాటిస్తున్నారు.
గుర్రానికి, గాడిదకి పెద్ద తేడా లేదు. రెండూ బానిసలే. తన్నే శక్తి ఉన్నా తన్నవు. గాడిదని ఎవరూ యుద్ధానికి తీసుకెళ్లరు. వేగమే గుర్రానికి శాపం. తనకి సంబంధం లేని యుద్ధంలో మరణిస్తుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆధునిక గుర్రాలు.
ఆటకి రూల్స్ వుంటాయి కానీ, గెలుపునకి వుండవు. పౌల్ ఆడిన వాడే విజేత. నీతో పని వుంటే, నువ్వు క్రికెట్ బ్యాట్‌తో ఫుట్‌బాల్ ఆడినా లోకం చప్పట్లు కొడుతుంది.
పక్షుల్లో కాకి అదృష్టవంతురాలు. దాన్ని ఎవరూ తినరు, వేటాడరు. ఆకలితో ఉన్న చేప ఎరని గుర్తించదు.
మనిషి సాధించిన కళలన్నీ కూడా ఒక గిజిగాడి గూడుతో సమానం కాదు. వందేళ్లు తపస్సు చేసినా దాన్ని నిర్మించలేడు.
గొర్రెలకి రాజకీయాలు నేర్పకు. కబేళానే సింహాసనం అనుకుంటాయి. విజయం పుస్తకాలు చదివితే రాదు. నాలుకకి తేనె పూసుకో అదే వస్తుంది.
జంతువుల్ని తినే సింహాన్ని రాజుగా చేయడంతోనే పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. వైవిధ్యమే ప్రకృతి సూత్రం అయినప్పుడు మనుషులంతా ఎప్పటికీ సమానం కాదు. కాపిటల్ రాసిన మార్క్స్‌కి కాపిటలిస్ట్‌లు అర్థం కాలేదు.
ఎముకల దండ వేసుకున్న పులితో ఏ ఇబ్బందీ లేదు. రుద్రాక్షలు ధరించి, కమండలంతో చావబాదే పులే ప్రమాదం. ఇది మన నీడ.
మనుషులు ఎందుకు నటిస్తారంటే , అది వాళ్ల జన్యు భాష, అద్దం కూడా అబద్ధం చెబుతుంది. కావాలంటే మ్యాజిక్ మిర్రర్‌లో చూసుకో. నమ్మిన వాళ్లు మోసం చేసారని దిగులు పడకు. నమ్మకం, మోసం పర్యాయ పదాలు.
నువ్వు ఎక్కాల్సిన రైలు ఏ ప్లాట్ ఫామ్ మీదకి వస్తుందో తెలియనప్పుడు ఏదో ఒకటి ఎక్కేయ్. ఎక్కడికి వెళ్లాలో, వెళుతున్నామో తెలియకుండా జీవిస్తున్న కాలం మనది.
గడియారంలో ముళ్లు తిరిగినా, తిరక్కపోయినా సమయం ఆగదు. నిద్ర నటించేవాడికి అలారం అవసరమా?
పని రాని వాడు, పనికొచ్చే వాడిని చెడగొట్టడమే ఉద్యోగ నైపుణ్యం. లంచ్ బాక్స్‌తో పాటు, పెదవుల మీద చిరునవ్వుని, నాలుక కింద చురకత్తిని ప్యాక్ చేసుకో. ఇంటికొచ్చి నవ్వుల్ని, కత్తి గాటుల్ని లెక్క పెట్టుకో.
మెదడు కీ బోర్డు లేని కంప్యూటర్. వైరస్‌తో హ్యాంగ్. కోడ్ రాయడం యోగుల వల్ల కూడా కాలేదు. పిల్లిని గుర్తించడమే ఎలుక ప్రాపంచిక జ్ఞానం. నాలుగు ఎలుకలతో పని చేయించడానికి 40 పిల్లులకి జీతమివ్వడమే ప్రభుత్వాల విధివిధానం.
ఈ దేహం అశాశ్వతమని మేకల మందకు తోడేలు బోధించడమే మోటివేషన్. ఎమోషన్లు ప్రమోషన్లకి స్పీడ్ బ్రేకర్లు. శుభంకార్డుతో సినిమా మొదలైతే ప్రేక్షకులకి ఆరోగ్యం. మనుషుల్ని చంపడానికి కొందరు డాక్టర్లు అవుతారు, మరికొందరు దర్శకులవుతారు.
గరుడ పురాణం అర్థం కావాలంటే శుక్రవారం పొద్దున్నే తెలుగు సినిమాకి వెళ్లు. ఆస్పత్రులు బతకాలంటే, మనుషులు చావాలి.
జీఆర్ మహర్షి