ప‌వ‌న్ ఆద‌ర్శాల ముచ్చ‌ట‌!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల‌కు కొత్త‌కాదు. కానీ అధికారానికి ఆయ‌న కొత్త‌. 2014లో టీడీపీ- బీజేపీ కూట‌మికి ఆయ‌న మ‌ద్ద‌తు ప‌లికారు. విస్తృతంగా ప్ర‌చారం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ ప‌వ‌న్ మ‌ద్ద‌తు ప‌లికిన కూట‌మే…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల‌కు కొత్త‌కాదు. కానీ అధికారానికి ఆయ‌న కొత్త‌. 2014లో టీడీపీ- బీజేపీ కూట‌మికి ఆయ‌న మ‌ద్ద‌తు ప‌లికారు. విస్తృతంగా ప్ర‌చారం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ ప‌వ‌న్ మ‌ద్ద‌తు ప‌లికిన కూట‌మే అధికారంలోకి వ‌చ్చింది. అయితే ఆయ‌న మాత్రం ఏ ప‌ద‌వీ తీసుకోలేదు. ప‌దేళ్లు తిరిగే స‌రికి ప‌వ‌న్ ఆలోచ‌న‌లు మారాయి. ఇప్పుడు ఆయ‌న కూట‌మి అధికారంలో భాగ‌స్వామి అయ్యారు.

ఉప ముఖ్య‌మంత్రిగా చాలా ఆద‌ర్శాలు చెబుతున్నారు. దేశంలోనే ఆద‌ర్శంగా తాను బాధ్య‌త వ‌హిస్తున్న పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ‌ను తీర్చిదిద్దుతాన‌ని చెబుతున్నారు. అలాగే త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇప్పించారు. అసెంబ్లీలోనూ, బ‌య‌ట ఎలా మెల‌గాల‌నే అంశాల‌పై ఆయ‌న దిశానిర్దేశం చేశారు. ప‌రుష ప‌ద‌జాలానికి చోటు ఇవ్వ‌కూడ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు.

ప్ర‌జ‌ల‌తోనూ, అధికారుల‌తోనూ మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ప‌వ‌న్ త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు ఆదేశాలిచ్చారు. ఇది మంచి ప‌రిణామం. స‌మాజం మంచీమ‌ర్యాద‌ల్ని మొద‌ట కోరుకుంటుంది. నాయ‌కుల నుంచి అభ్యంత‌ర‌క‌ర భాష‌ని పౌర స‌మాజం కోరుకోదు. బ‌హుశా వైసీపీ అనుభ‌వాల నుంచి ప‌వ‌న్ గుణ‌పాఠం నేర్చుకున్న‌ట్టున్నారు. వైసీపీ నేత‌ల్లా త‌మ పార్టీకి చెందిన నాయ‌కులు నోరు పారేసుకోవ‌ద్ద‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. ఈ విష‌యంలో ప‌వ‌న్‌ను త‌ప్ప‌క అభినందించాలి. ఇలా గ‌తంలో త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు వైఎస్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేసి వుంటే, రాజ‌కీయంగా ఇంత న‌ష్టం జ‌రిగి వుండేది కాదేమో!

అలాగే పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ‌ల‌కు సంబంధించి అద్భుతాలు చేయాల‌ని ప‌వ‌న్ క‌ల‌లు కంటున్నారు. దీన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌లేరు. అయితే నిధులే అస‌లు స‌మ‌స్య‌. తానెంతో ఇష్ట‌ప‌డి తీసుకున్న మంత్రిత్వ శాఖ అని, ప‌ల్లెల రూపు రేఖ‌లు మార్చాల‌ని ఆయ‌న అంటున్నారు. ఇందుకు అధికారులు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం గ్రామీణ ప్రాంతాల‌తో నిర్మిత‌మై ఉంది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పంచాయ‌తీరాజ్ నిధుల్ని సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌ళ్లించ‌డంతో చిన్న‌చిన్న ప‌నులు చేయ‌డానికి స‌ర్పంచులు ఇబ్బందిప‌డ్డారు. వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో స్థానిక సంస్థ‌ల‌న్నీ అలంకారప్రాయంగా మిగిలాయ‌న్న‌ది వాస్త‌వం. త‌న హ‌యాంలో అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి వుంటుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆద‌ర్శాలు చెబుతున్నారు. మంచి చేయాల‌నే ప్ర‌జ‌లు కూడా కోరుకుంటున్నారు. ఆ న‌మ్మ‌కంతోనే కూట‌మికి అధికారం అప్ప‌గించారు. అయితే ఆచ‌ర‌ణ‌కు, ఆద‌ర్శాల‌కు చాలా వ్య‌త్యాసం వుంటుంది. ప‌ల్లె సీమ‌ల్ని సుసంప‌న్నంగా తీర్చిదిద్దాల‌న్న ప‌వ‌న్ క‌ల‌లు నెర‌వేరాల‌ని ఆకాంక్షిద్దాం.