గతంలో ఎన్నడూ లేని విధంగా లోక్‌సభ స్పీకర్‌కు ఎన్నిక అనివార్యమైంది. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే, స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి మద్దతు ఇస్తామని ఇండియా కూటమి చెప్పింది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి ఇవ్వడానికి ఎన్డీఏకి మనసు రాలేదు. దీంతో ఎన్డీఏ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున సురేష్ బరిలో నిలిచారు. ఇవాళ ఎన్నిక జరగనుంది.
ఈ ఎన్నికలో ఎన్డీఏకి వైసీపీ మద్దతు పలకడం విశేషం. అందరూ ఊహించిందే. అయితే ఏపీలో తనను మట్టి కరిపించిన ఎన్డీఏకి వైసీపీ మద్దతును ఎలా సమర్థించుకుంటుందో అనే చర్చకు తెరలేచింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి తామెందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో చాలా గొప్పగా చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ లాలూచీ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్డీఏ అభ్యర్థి ఓంబిర్లాకు మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని లాంఛనంగా జరిగే స్పీకర్ ఎన్నికలో ఓంబిర్లాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
కాంగ్రెస్‌తో లాలూచీ రాజకీయాలు చేసి వుంటే, మరి ఆ పార్టీతో బీజేపీ ఎందుకు కలిసి వుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాంగ్రెస్ చేసింది రాజకీయం అని వైసీపీకి అర్థం కాకపోతే ఎట్లా? కాంగ్రెస్‌తో వైసీపీకి వ్యక్తిగత వైరం ఏంటో మరి! జగన్‌పై కేసులు, అలాగే ఆయన్ను జైలుకు పంపడానికి కాంగ్రెస్ కారణమని వైసీపీ భావిస్తోంది. అందుకే ఆ పార్టీపై వైసీపీ రగిలిపోతోంది. రాజకీయాల్లో తన ధోరణి ఎంత వరకు సరైందో వైసీపీకి అర్థమవుతున్నట్టు లేదు.
ఇదే యూపీఏ హయాంలో డీఎంకే నేతలు కనిమొళి, రాజా తదితరులపై అవినీతి కేసులు నమోదయ్యాయి. నెలల తరబడి వారు జైల్లో గడిపి వచ్చారు. ఇండియా కూటమిలో డీఎంకే క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్న సంగతిని జగన్, వైసీపీ నేతలు మరిచిపోకూడదు. ఏపీలో తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన ఎన్డీఏకు వైసీపీ మద్దతు ఇవ్వడం వల్ల చివరికి తన పార్టీ శ్రేణులు కూడా దూరమవుతాయనే గ్రహింపు వైసీపీకి లేదు. ఒకవేళ మద్దతు ఇచ్చినా, సమర్థన దారుణంగా వుంది.
ప్రతి దానికీ టీడీపీని ముందుకు తెచ్చి, ఏదో చెబితే జనం నమ్మరని ఇప్పటికైనా వైసీపీ గుర్తించి, మసులుకుంటే మంచిది. తమ తీరు వల్లే ఇటీవలి ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్‌కు చేరవవుతూ, తనకు దూరమయ్యారని వైసీపీ నేతలకు తెలియదని అనుకోవాలా?.