కల్కి- ఇక మిగిలింది పాజిటివ్ టాక్

అంతా పూర్తయింది. దాదాపు ఆరు నెలల తరువాత ఓ పెద్ద సినిమా థియేటర్ లోకి రాబోతోంది. ఇంకా చెప్పాలంటే ఏడు వందల కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అత్యంత భారీ ఫ్యూచరిస్టిక్ సినిమా తెరపైకి…

అంతా పూర్తయింది. దాదాపు ఆరు నెలల తరువాత ఓ పెద్ద సినిమా థియేటర్ లోకి రాబోతోంది. ఇంకా చెప్పాలంటే ఏడు వందల కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అత్యంత భారీ ఫ్యూచరిస్టిక్ సినిమా తెరపైకి రాబోతోంది.

సరైన సినిమా థియేటర్ లో చూసి, సరైన థియేటర్ ఎక్స్ పీరియన్స్ అనుభవించి చాలా నెలలు అయింది. ప్రేక్షకులు ఆసక్తిగా వున్నారు. మహాభారతం థ్రెడ్ గా తీసుకుని, కొన్ని వందల ఏళ్ల తరువాత ప్రపంచం ఎలా వుండబోతోంది.. ఎన్ని అగచాట్లు.. ఎన్ని అపాయాలు.. ఇలాంటివి ఊహించి, కథగా మలిచి దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తున్న సినిమా ఇది.

అమితాబ్ ఫుల్ లెంగ్త్ రోల్. దీపీక కూడా డిటో.. డిటో.. ప్రభాస్ కథానాయకుడు.. ఇంకా చాలా అంటే చాలా మంది నటులు. విజయ్ దేవరకొండ, దుల్కర్, మృణాళ్, నాని, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వున్నారంటూ గ్యాసిప్ లు. మహాభారత పాత్రలు, మహాభారత యుద్దం తెరపై వుంటుందనే టాక్. వెరసి కల్కి సినిమా మీదా భారీ భారీ అంచనాలు.

ఈ అంచనా మేరకు విదేశాల్లో భారీ అడ్వాన్స్ బుకింగ్ లు, నైజాం అర్బన్ సెంటర్లలో, ముఖ్యంగా జంట నగరాల్లో అత్యంత భారీ ఓపెనింగ్, ఆంధ్రలో హడావుడి. హిందీ బెల్ట్ లో కూడా చూడాలనే ఆసక్తి మొత్తం మీద తొలి రోజు కలెక్షన్ 200 కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్న జోస్యాలు.

ఇవన్నీ ఒకె. శుక్రవారం నుంచి ఏమిటి పరిస్థితి.  టోటల్ రన్ సంగతి ఏమిటి? నిర్మాత లాభ నష్టాలు.. ఇవన్నీ తేలాలంటే మిగిలింది ఒక్కటే. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం. మామూలు పాజిటివ్ టాక్ కాదు. నూటికి నూరు పాళ్లు పాజిటివ్ టాక్.

డిజిటల్ మీడియా ప్రభావం ఎక్కువగా వున్న ఈ రోజుల్లో యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ కు అస్సలు అవకాశం ఇవ్వనంత పాజిటివ్ టాక్ రావాలి. నిజానికి ఈ రేంజ్ సినిమాలు ఎబౌవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంటే చాలు. బండి పరుగెత్తేస్తుంది. బాహుబలి వన్ నుంచి పుష్ప వరకు చెప్పింది ఇదే. చూపించింది ఇదే. కానీ అబౌవ్ యావరేజ్ లోపలికి మాత్రం రాకూడదు.

ఎందుకంటే కల్కి పూర్తిగా ఫ్యాన్స్ స్టఫ్ వుండే సినిమా కాదు. కమర్షియల్ ఫార్మాట్ కాదు. మన మహా భారతం ఆధారంగా, హాలీవుడ్ స్టయిల్ కంటెంట్ ను తెలుగు వాళ్లకు చూపించే ప్రయత్నం. దాన్ని ఇళ్లలో వున్న పెద్ద వాళ్లు సైతం చూడాలనే అనుకుంటారు. కానీ అలా అనుకోవాలంటే టాక్ పాజిటివ్ గా రావాలి. వచ్చి తీరాలి.