ఓటీటీలో వాటా.. కోలీవుడ్ ఎగ్జిబిటర్ల కొత్త వాదన

నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఉండే సమస్యలు, గొడవల గురించి కొత్తగా చెప్పేదేముంది. సౌత్ లో ఏ స్టేట్ లో తీసుకున్నా ఇదే పంచాయితీ. ఇలాంటి డిమాండ్లు కోలీవుడ్ లో కూడా ఉన్నాయి. అయితే తమిళనాడు…

నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఉండే సమస్యలు, గొడవల గురించి కొత్తగా చెప్పేదేముంది. సౌత్ లో ఏ స్టేట్ లో తీసుకున్నా ఇదే పంచాయితీ. ఇలాంటి డిమాండ్లు కోలీవుడ్ లో కూడా ఉన్నాయి. అయితే తమిళనాడు ఎగ్జిబిటర్లు మరో కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. వాళ్లకు ఓటీటీ ఆదాయంలో కూడా వాటా కావాలంట.

ఏ నిర్మాతైనా థియేట్రికల్ రిలీజ్ కోసమే సినిమా తీస్తాడు. అయితే ఓటీటీ ద్వారా ఎక్కువ లాభం ఆర్జిస్తున్నాడు. అలాంటి నిర్మాతలంతా ఓటీటీ ద్వారా తమకొచ్చిన లాభాల్లో కొంత వాటాను ఎగ్జిబిటర్లకు పంచాలంటూ తమిళనాడు ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీర్మానం చేసింది. కాస్త వింతగా ఉన్నప్పటికీ, ఇది కొంచెం ఆలోచించదగ్గ డిమాండే.

ఎందుకుంటే.. కోలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, చాలామంది నిర్మాతలు సినిమా నిర్మాణ దశ నుంచే ఓటీటీ నుంచి వచ్చే డబ్బులు కోసం ఆశపడుతున్నారు. తమ సినిమా థియేటర్స్ లో బాగా ఆడాలని ఆలోచించే నిర్మాతలు తగ్గిపోతున్నారు. నామ్ కే వాస్తే థియేటర్లలో రిలీజైతే చాలు, తర్వాత ఓటీటీకి అమ్ముకోవచ్చనే ఆలోచనతోనే చాలామంది నిర్మాతలున్నారు.

కొంతమంది నిర్మాతల ఈ మైండ్ సెట్ వల్ల బయ్యర్లతో పాటు ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు. అందుకే ఇకపై ఓటీటీ లాభాల్ని కూడా ఎగ్జిబిటర్లకు పంచాలని నిర్మాతలను డిమాండ్ చేస్తోంది తమిళనాడు ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్.

ఇక ఓటీటీ రిలీజ్ పై కూడా వీళ్లు కొన్ని డిమాండ్స్ పెట్టారు. కొత్త సినిమాను థియేటర్లలో విడుదలైన 8 వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెట్టకూడదని, థియేటర్లలో ఓ సినిమా రిలీజై 4 వారాలు పూర్తిచేసుకున్న తర్వాత మాత్రమే ఓటీటీలు ఆ సినిమా స్ట్రీమింగ్ గురించి ప్రచారం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

థియేటర్లలో వరల్డ్ కప్, ఐపీఎల్ మ్యాచులు..

తమిళనాడు ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసిన అంశాల్లో మరో కీలకమైన అంశం కూడా ఉంది. వాణిజ్య కార్యక్రమాల నిర్వహణకు కూడా థియేటర్లకు అనుమతి ఇవ్వాలని వీళ్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచులతో పాటు, అన్ని రకాల క్రికెట్ మ్యాచుల్ని థియేటర్లలో ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. 50 వేల మంది స్టేడియంలో కూర్చొని క్రికెట్ చూస్తున్నప్పుడు ఎదురవ్వని సెక్యూరిటీ ఇష్యూ, థియేటర్లలో 500 మంది కూర్చుంటే ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు.

త్వరలోనే వరల్డ్ కప్ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఈ అంశాన్ని తొందరగా పరిశీలించి, క్రికెట్ మ్యాచుల్ని థియేటర్లలో ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు కరెంట్ చార్జీలు తగ్గించాలని, ఆస్తి పన్ను కూడా తగ్గించాలని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేయడానికి అనుమతించాలని, వీళ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వీళ్ల డిమాండ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఓటీటీ ఆదాయంలో కూడా వాటా కావాలని డిమాండ్ చేయడం మాత్రం కాస్త కొత్తగా, వింతగా ఉంది. దీనిపై ఇటు నిర్మాతల మండలి, అటు ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.