ఆయన వయసు ఆరున్నర పదులు. అటువంటి పెద్ద మనిషి జలాసనం వేసి అందరినీ అబ్బురపరచారు. ఏకంగా గంట పాటు ఆయన వేసిన జలాసనం చూసి యూత్ కేరింతలు కొడితే సీనియర్లు ఇది కదా మన తరం సత్తా అని మురిసిపోయారు.
జాతీయ స్విమ్మింగ్ పూల్ డే ను పురస్కరించుకొని మంగళవారం విజయనగరంలోని స్థానిక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులోని స్విమ్మింగ్ పూల్లో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నిర్వహించిన జలాసన విన్యాసం అందరినీ ఆకట్టుకుంది.
నీటి మీద అలా గంట సేపు తేలియాడుతూ కోలగట్ల కనిపించారు. ఆయన యోగా సాధనకు స్థానిక ప్రజల నుంచి ప్రశంసలు లభించాయి. మంత్రి బొత్స సత్యనారాయణ, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర డిప్యూటీ స్పీకర్ జల యోగ సాధన దీక్షను ప్రారంభించారు.
ఈనాటి యువతరానికి క్రీడల ప్రాధాన్యత తెలియచేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను జలాసనాన్ని వేశానని చెప్పారు. యువత స్మార్ట్ ఫోన్లు పట్టడం కాదు యోగా సాధన చేయాలని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఆటలకు ఈతకు నో ఏజ్ అని ఒక అద్భుత సందేశం కూడా కోలగట్ల ఇచ్చారు. ఆయన జలసాధనతో యూత్ ఐకాన్ గా మారిపోయారు అని అంటున్నారు.