లోక్సభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్ ఎన్నికలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. స్వతంత్ర భారతావనిలో ఇప్పటి వరకూ లోక్సభ స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. కానీ 18వ లోక్సభలో మాత్రం ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. ఇందుకు ఎన్డీఏ కూటమి అనుసరించిన ఒంటెత్తు పోకడే కారణమని ఇండియా కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎన్డీఏ పక్షాన లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా ఓంబిర్లాను మరోసారి ఎంపిక చేశామని, ఏకగ్రీవంగా ఎన్నికోడానికి సహకరించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతల్ని కోరారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు తమ సహకారం కావాలంటే ఇండియా కూటమి నేతలు షరతు పెట్టారు. అదేంటంటే… తమ కూటమికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని. దీనిపై ఎన్డీఏ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
మరోవైపు ఎన్డీఏ కూటమి తరపున స్పీకర్ అభ్యర్థిగా ఓంబిర్లా, ఇండియా కూటమి నుంచి కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కె.సురేష్ నామినేషన్ వేయడం విశేషం. దీంతో స్పీకర్ పదవి కోసం ఎన్నిక అనివార్యమైంది. 294 మంది సభ్యులున్న ఎన్డీఏ ఎలాగైనా స్పీకర్ పదవిని సొంతం చేసుకుంటుంది. అయితే ఈ ఎన్నిక వైసీపీకి ఓ పరీక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏతో వైసీపీ తలపడింది. ఎన్డీఏ చేతిలో ఘోర పరాజయం పొందింది.
ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరం. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంప్రదాయమని, దానికి విరుద్ధంగా ఇండియా కూటమి వ్యవహరిస్తుందని చెప్పి, చివరికి తనను చిత్తుచిత్తుగా ఓడించిన ఎన్డీఏకు మద్దతు తెలిపే అవకాశాలే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.