వైసీపీకి 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే ప్రజలు కట్టబెట్టారు. భవిష్యత్‌లో ప్రజాదరణ పొందడానికి ప్రయత్నించడం తప్ప, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రజాతీర్పును ఎంతటి వారైనా శిరసా వహించాల్సిందే. అయితే గత అసెంబ్లీలో అతి తక్కువ సీట్లతో అడుగు పెట్టిన చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ అభ్యర్థుల్ని సీఎం హోదాలో వైఎస్ జగన్, ఆయన పార్టీ అభ్యర్థులు అవహేళన చేశారు.
తాను తలచుకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా టీడీపీ అభ్యర్థుల్ని చేరదీస్తానని జగన్ అసెంబ్లీ వేదికగా ఒక సందర్భంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గత అసెంబ్లీ అనుభవాలు వెంటాడుతున్న నేపథ్యంలో అతి తక్కువ మంది సభ్యులతో చట్టసభ సమావేశాలకు వెళ్లడానికి జగన్‌కు మనస్కరించలేదు. దీంతో ఎలాగైనా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యేందుకు సాకు కోసం జగన్ వెతుకుతున్నారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తనను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకుండా, మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారంటూ వైఎస్ జగన్ తాజాగా నిష్టూరమాడుతూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. ఈ లేఖలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని ఆయన అభ్యర్థించడం విశేషం. అప్పుడైతేనే అసెంబ్లీలో ప్రజాసమస్యలపై ప్రస్తావించడానికి తగిన సమయం దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు.
పది శాతం సీట్లు వుంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఏ చట్టంలో లేదని స్పీకర్‌కు జగన్ గుర్తు చేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే ముందస్తుగా నిర్ణయించుకున్నట్టు ఇటీవల ప్రమాణ స్వీకారం సందర్భంగా వ్యవహరించిన తీరు తెలియజేస్తోందని జగన్ తెలిపారు. స్పీకర్‌కు జగన్ లేఖ రాయడం వెనుక వ్యూహం కనిపిస్తోంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వాటికి వెళ్లకూడదని జగన్ ముందే నిర్ణయించుకున్నారు.
అలాగే స్పీకర్ ఎన్నిక సందర్భంగా కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లలేదు. ఇదేమంటే… తనను చచ్చేదాకా కొట్టాలన్న వ్యక్తిని స్పీకర్‌గా ఎంపిక చేశారని, అలాంటప్పుడు తానెలా వెళ్తానని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ ఎంపికకే వెళ్లని జగన్, ఇప్పుడు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అభ్యర్థిస్తూ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. భవిష్యత్‌లో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని చెప్పుకోడానికి ఈ లేఖ పనికొస్తుందని జగన్ భావనగా కనిపిస్తోంది
Prathipakshaa hodha radhu seats thakuva kadha correct kadhu