గుడివాడకు ముకుతాడు?

విశాఖ నుంచి వైసీపీ తరఫున వినిపించే పెద్ద గొంతు యువనేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్. ఆయన ఒక్కరే పార్టీ ఓటమి తరువాత కూడా అధికార పార్టీ మీద ఘాటు విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నారు.…

విశాఖ నుంచి వైసీపీ తరఫున వినిపించే పెద్ద గొంతు యువనేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్. ఆయన ఒక్కరే పార్టీ ఓటమి తరువాత కూడా అధికార పార్టీ మీద ఘాటు విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నారు. వైసీపీ ఆఫీసులను కూల్చాలని అధికార టీడీపీ చూస్తోందని ఏపీలో టీడీపీ కట్టిన పార్టీ ఆఫీసుల సంగతేంటని గుడివాడ సూటిగా ప్రశ్నించడం కూటమి ప్రభుత్వానికి మింగుడుపడని వ్యవహారమే అవుతోంది.

ప్రతీ దానికీ ప్రశ్నిస్తూ ఫ్లాష్ బ్యాక్ లను తీసుకుని వస్తున్న గుడివాడకు ముకుతాడు వేయాలని కొత్త ప్రభుత్వం రెడీ అవుతోంది అని అంటున్నారు. అందులో భాగంగా ఆయన సొంత భవనాల మీదకు వచ్చారు అని వైసీపీ నేతలు అంటున్నారు.

గాజువాకలోని చట్టివానిపాలెంలో అనుమతి లేకుండా నాలుగు అంతస్తుల భవనాన్ని గుడివాడ నిర్మించారని పేర్కొంటూ జీవీఎంసీ అధికారులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చారు. దీని మీద వారం రోజుల వ్యవధిలో వివరణ ఇవ్వాలని సదరు నోటీసులో స్పష్టం చేశారు.  లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని అందులోనే పేర్కొన్నారు.

గుడివాడ అనుమతులు లేని భవనం కట్టారని జనసేన కార్పోరేటర్ జీవీఎంసీకి ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. గుడివాడ అటు టీడీపీకి ఇటు జనసేనకు కూడా అధికారంలో ఉన్నపుడు పదునైన విమర్శలతో కంటగింపుగా మారారు. మాజీ మంత్రి అయ్యాక ఆయనే టార్గెట్ అవుతారని అనుకున్నారు. కాస్తా తొందరగానే ఆయన మీద యాక్షన్ మొదలైంది అని అంటున్నారు. అయితే ఇదింకా ట్రయల్ పార్ట్ అని ముందు సినిమా ఉందని అధికార పక్ష నేతలు అంటున్నారు.