రంగురాళ్ళు వారి జీవితానికి రంగులు హంగులూ చూపిస్తాయని గిరిజనులు ఆశ పడతారు. ప్రతి ఏటా వర్షాకాలం సీజన్ మొదలవగానే రంగురాళ్ళ వేట స్టార్ట్ చేస్తారు. రంగురాళ్ళ కోసం సాహసమే చేస్తూంటారు. ఒక్కోసారి ప్రాణాల మీదకే తెచ్చుకుంటారు.
ఇది ఉమ్మడి విశాఖ జిల్లా మన్యంలో ఎపుడూ జరిగే తంతు. ఆశలకు ఆరాటాలకు మధ్య పోరాటంగా దీనిని చూడాలి. రంగురాళ్ళ కోసం తవ్వకాలు చేసేందుకు గిరిజనులు ఉత్సహ పడతారు. వారిని వెనక నుంచి రంగురాళ్ళతో భారీ వ్యాపారాలు చేసే వ్యాపారులు ప్రోత్సహిస్తూంటారు. వారు చూపించే డబ్బు ఆశతో వీరు రంగురాళ్ళ కోసం కొండలు గుట్టలు వెంటపడుతూంటారు.
ఏజెన్సీలోని అనేక గ్రామాలు ఇపుడు రంగురాళ్ళ తవ్వకాలతో సందడి చేస్తున్నాయి. రంగురాళ్ళు కొనుగోలు చేసేందుకు దళారీలు వ్యాపారులూ కూడా తిష్టవేసి ఉన్న వాతావరణం ఉంది. అయితే రంగురాళ్ళ కోసం అమాయక గిరిజనులను ఉపయోగించుకోవడం పట్ల ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. రంగురాళ్ళు తవ్వకాలలో జోక్యం చేసుకోవద్దు అని గిరిజనులకు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఒకవేళ ఆదేశాలు ధిక్కరించి రంగురాళ్ళు తవ్వుతూ గిరిజనులు పట్టుబడితే వారి అటవీ భూమి హక్కు పట్టాలను రద్దు చేస్తామని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. గూడెం కొత్తవీధి మండలంలోని పలు గ్రామాలలో రంగురాళ్ళ క్వారీలో తవ్వకాలు జరుగుతున్నాయి. వాటి మీద అధికారులు విచారణ చేస్తూ గోతులను పూడ్చిచేస్తున్నారు.