అవినీతి రాజకీయాలకు థ్యాంక్స్

అవినీతిపై పోరాటమే భారతీయుడు సినిమా. “లంచం..లంచం..లంచం.. ఎక్కడ చూసినా లంచం” అంటూ 26 ఏళ్ల కిందట కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. అయితే దశాబ్దాలు గడిచినా ఆ డైలాగ్ లో ఎలాంటి…

అవినీతిపై పోరాటమే భారతీయుడు సినిమా. “లంచం..లంచం..లంచం.. ఎక్కడ చూసినా లంచం” అంటూ 26 ఏళ్ల కిందట కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. అయితే దశాబ్దాలు గడిచినా ఆ డైలాగ్ లో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు కమల్ హాసన్.

భారతీయుడు-2 ట్రయిలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్… అప్పటికీ ఇప్పటికీ అవినీతి పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గలేదన్నారు. “భారతీయుడు-2 సినిమాను తాము తీయడానికి స్ఫూర్తినిచ్చిన దేశ రాజకీయాలకు థ్యాంక్స్” అంటూ సెటైర్ వేశారు.

శంకర్ దర్శకత్వంలో సీక్వెల్ గా తెరకెక్కింది భారతీయుడు-2 సినిమా. మొదటి సినిమా పూర్తిగా తమిళనాడు చుట్టూ తిరుగుతుంది. కానీ సీక్వెల్ మాత్రం కథ ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తుంది. అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమాన్ని భారతీయుడు-2లో చూడొచ్చు.

భారతీయుడు సినిమాలో 20 రోజులు మాత్రమే ప్రోస్తటిక్స్ లో నటించారట కమల్ హాసన్. కానీ పార్ట్-2లో మాత్రం ఏకంగా 70 రోజుల పాటు ప్రోస్తటిక్స్ లో నటించారని, మేకప్ వేయడానికి తీయడానికి గంటల సమయం పట్టేదని, ప్యాకప్ చెప్పిన తర్వాత అందరికంటే చివరిగా కమల్ హాసన్ ఇంటికెళ్లేవారని గుర్తుచేసుకున్నారు దర్శకుడు శంకర్. కమల్ హాసన్ లో నటుడ్ని భారతీయుడు సినిమాలో కంటే ఈ సీక్వెల్ లో ఎక్కువగా చూస్తారట ప్రేక్షకులు.