‘తాతకు పెట్టిన బొచ్చె తలాపునే ఉంటుంది’…‘నువ్వు ఎదుటివారికి ఏం చేశావో నీకు అదే అవుతుంది’….‘కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు’….ఇవన్నీ మంచి మాటలనుకోండి, నీతి వాక్యాలు అనుకోండి, హిత బోధలు అనుకోండి ఇవన్నీ గులాబీ పార్టీకి ప్రత్యేకంగా కేసీఆర్కు వర్తిస్తాయి. ఆ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది? అప్పట్లో కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారు? ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మంచిది.
గులాబీ పార్టీ నుంచి ఒక్కో ఎమ్మెల్యే జారిపోతుంటే ఆ పార్టీలో, తండ్రీ కొడుకుల్లో యమ కంగారు పుడుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెసు పార్టీలో కండువాలు కప్పుతుంటే వీళ్లు గంగవెర్రులెత్తిపోతున్నారు. శివాలెత్తుతున్నారు. అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ కాంగ్రెసు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కేటీఆర్ అంటున్నాడు. ఫిరాయింపులు అనైతికమని అంటున్నాడు. ప్రజలు బుద్ధి చెబుతారని అంటున్నాడు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పని ఇదే కదా. అప్పట్లో అసెంబ్లీలో కాంగ్రెసు, టీడీపీ ఉండకూడదని కంకణం కట్టుకొని ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలో చేర్చుకున్నాడు. టీడీపీ లెజిస్లేచర్ పార్టీ మొత్తాన్ని విలీనం చేసుకున్నాడు. ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేశాడు. కాంగ్రెసుకు ప్రధాన ప్రతిపక్ష స్థానం లేకుండా చేశాడు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదనేది కదా కేసీఆర్ లక్ష్యం.
ఇప్పుడు కాంగ్రెసు అదే పని చేస్తోంది. ఇందులో తప్పేముంది? వాస్తవానికి ఫిరాయింపులు తప్పు (థియరీ ప్రకారం). కాని అధికారంలో ఏ పార్టీ ఉన్నా అదే పని చేస్తోంది కదా. ఏపీలో (విభజిత) చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పని కదా చేసింది. ఫిరాయింపుల మీద కోర్టుకు పోతామని కేసీఆర్ చెబుతున్నాడు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెసు వాళ్లు కూడా కోర్టుకు వెళ్లారు. ఏమైంది? ఏమీ కాలేదు.
ఈ కాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వాలు సహకరించడంలేదు. నిధులు ఇవ్వడంలేదు. వారి మాటను అధికారులు ఖాతరు చేయడంలేదు. పనులు చేయకపోతే ఎన్నికల్లో ప్రజలు ఓడగొడతారు. ఈ కారణాలతో తాము అధికార పార్టీలో చేరుతున్నామంటున్నారు. గతంలో గులాబీ పార్టీలో చేరినవారు ఇదే మాట చెప్పారు. ఇప్పుడు కాంగ్రెసు పార్టీలో చేరినవారూ ఇదే మాట చెబుతున్నారు.
మడి కట్టుకొని స్ట్రిక్టుగా ఉండే కమ్యూనిస్టు పార్టీల నాయకులే పార్టీ ఫిరాయిస్తుంటే ఇక బూర్జువా పార్టీల సంగతి చెప్పేదేముంది? ఫిరాయింపుల చరిత్ర లేని నాయకులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిరాయింపుదారుడే. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిరాయింపుదారుడే. అందరూ గురువిందలే. వారి కింద ఉండే నలుపు వారికి తెలియదు. తెలిసినా రాజకీయ నాయకులు పట్టించుకోరు. ఇంతేరా ఫిరాయింపుల పర్వం.. తిరిగే రంగుల రాట్నం.