కష్టాల్లో వున్నపుడు పలకరించిన వాళ్లే మనవాళ్లు. అధికారంలోకి వచ్చినపుడు పలకరించే వాళ్లు కాదు. ఇప్పుడు ఇదే ఆలోచనాధోరణిలో వున్నారు చంద్రబాబు, లోకేష్ అని తెలుస్తోంది. గతంలో ఎలా వుండేది అంటే తెలుగుదేశం అధికారంలో వున్నపుడు వెళ్లి వాళ్లు చుట్టూ తిరిగి పనులు చేయించేసుకోవడం, అధికారంలో లేకుంటే సైలంట్ గా వుండడం. 2019 నుంచి 2024 వరకు టాలీవుడ్ లో చాలా మంది ఇలాగే వున్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే దగ్గర కావాలని చూస్తున్నారు.
కానీ ఈసారి చంద్రబాబు, లోకేష్ గతంలో మాదిరిగా లేరు. ముఖ్యంగా చంద్రబాబు జైలుకు వెళ్లాల్సి వచ్చినపుడు ఎవరు ధైర్యంగా ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారో, ఎవరు ఇంట్లో కూర్చుని మౌనంగా వున్నారో అన్నీ ఆ ఇద్దరికీ తెలుసు. అందుకే అలాంటి వాళ్లను ఇప్పుడు దూరం పెడుతున్నారు. నిన్నటికి నిన్న టెలి కాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. పార్టీని కష్టకాలంలో నమ్ముకున్న కార్యకర్తలను వదులుకోనని, అలాగే కాని వాళ్లను దగ్గరకు రానివ్వనని క్లారిటీ ఇచ్చారు.
నిన్నటికి నిన్న టాలీవుడ్ జనాలు డిప్యూటీ సిఎమ్ పవన్ ను కలిసి వచ్చారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇప్పించాలని వీరంతా పవన్ ను కోరడం విశేషం. వీరిలో చాలా మందికి చంద్రబాబుతో నేరుగా యాక్సెస్ వుంది. అలాంటిది అపాయింట్ మెంట్ కోసం పవన్ ను కోరడం ఏమిటి?
దగ్గుబాటి సురేష్ బాబు లాంటి వారు చంద్రబాబు అరెస్ట్ టైమ్ లో మౌనంగా వుండి పోయారు. బాహాటంగా ఖండించలేకపోయారు. ఇవన్నీ బాబు, లోకేష్ ల మదిలో పదిలంగా వున్నాయి. అందుకే టాలీవుడ్ జనాలు ముందుగా లోకేష్ ను కలుద్దామని ప్రయత్నించినా వీలు పడలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ రెండో రూట్ లో వెళ్లారని బోగట్టా.
కానీ ఏది ఏమైనా ఈసారి టాలీవుడ్ జనాల మెహర్బానీలకు మాత్రం బాబు- లోకేష్ అంత సులువుగా పడే అవకాశం లేదని, వీరి సంగతి అర్థం అయిపోయిందని తెలుగుదేశం మద్దతు వర్గాల బోగట్టా.
ఇదిలా వుంటే టాలీవుడ్ జనాలు వెళ్లినపుడు పవన్ కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల టికెట్ రేట్లు పరిశీలించి, ప్రతిసారీ పెంచడం, తగ్గించడం లాంటి విధానం కాకుండా, ఓ సరైన ప్రణాళికతో వస్తే, తాను చంద్రబాబును ఒప్పిస్తానని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.