చంద్రబాబు సర్కార్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతతో పరిపాలన ప్రారంభించింది. వైసీపీ విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరికి ఇదో ఉదాహరణగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల నిర్మాణాలతో పాటు ప్రైవేట్‌గా నిర్వహించే వాటిపై కూడా 24 గంటల్లో వివరాలు అందించాలంటూ మున్సిపల్ శాఖ ఇటీవల అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు వెంటనే వివరాలు ప్రభుత్వానికి చేరిపోయాయి.
మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 18 చోట్ల అనుమతుల్లేకుండా వైసీపీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టారని ప్రభుత్వం తేల్చేసింది. అయితే వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేసి వుండకూడదేమో అని సీనియర్ నేతలు అభిప్రాయపడుతుండగా, చేయాల్సిందే అని యువ నేతలు అంటున్నారని తెలిసింది. వైసీపీ కార్యాలయం కూల్చివేతతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాటిపై ప్రత్యేక దృష్టి వెనుక తమ యువ నాయకుడు నారా లోకేశ్ ఉన్నాడని టీడీపీ నేతలు చెబుతున్నారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా లోకేశ్ పలు సందర్భాల్లో తన తండ్రి చంద్రబాబునాయుడు శ్రీరాముడైతే, తాను మాత్రం మూర్ఖుడినని చెప్పడం గురించి తెలిసిందే. గతంలో వైసీపీ కక్షపూరిత చర్యలకు .. ఇప్పుడు చోటు చేసుకుంటున్నవన్నీ ప్రతిచర్యలుగా లోకేశ్ భావిస్తున్నారు. అందుకే వైసీపీ దారుణంగా ఓడిపోయినప్పటికీ, 40 శాతం ఓటు బ్యాంక్ ఉండడాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నారు.
వైసీపీ మూలాలే లేకుండా చేయాలని లోకేశ్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఎందాకైనా అన్నట్టు లోకేశ్ దూకుడు ప్రదర్శిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. లోకేశ్ ఉడుకు రక్తం కదా, అందుకే జోష్‌లో ఉన్నారని వారు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా అధికారం చేతిలో వుండడంతో తగ్గేదే లే అని లోకేశ్ వైసీపీ అంతు తేల్చడానికి ప్రాధాన్యం ఇస్తున్నారనేది టీడీపీ నేతల అభిప్రాయం.