మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దారుణ పరాజయం పాలైన తర్వాత తీవ్ర నిరాశనిస్పృహలకు లోనయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటూ, తన పార్టీ అభ్యర్థులు, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా జగన్ చేస్తున్న కామెంట్స్‌ను వైసీపీ నాయకులు, కార్యకర్తలు …ఏందో మా నాయకుడు పదేపదే రోటిన్ డైలాగులు మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా అంటున్నారు.
శకుని మాయా పాచికలు విసిరినట్టుగా ఎన్నికల తీర్పు వుందని, ఈవీఎంలలో ఏదో గోల్‌మాల్ జరిగిందని ఆయన అనడం సొంత పార్టీ శ్రేణులకు ఏ మాత్రం నచ్చలేదు. అలాగే పులివెందులలో మూడురోజుల పాటు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పడానికి రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనం పులివెందులకు వెళ్లారు. తనను కలిసిన ప్రజానీకంతో ఆయన అన్న మాటలు ఏంటంటే..
“వైసీపీపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం వుంది. మనం చేసిన మంచి అందరికీ తెలుసు. ప్రజల గుండెల్లో వుండిపోయింది. ప్రజలు మళ్లీ తప్పకుండా మనవైపే చూస్తారు. ఎవరూ అధైర్యపడొద్దు. అండగా వుంటా. రుణమాఫీ లాంటి ఆచరణ సాధ్యం కాని హామీల్ని ఇచ్చి మోసగించలేను. నీతి, నిజాయితీతో రాజకీయం చేస్తా” అని జగన్ అన్నారు.
ఈ కామెంట్స్‌ని వైసీపీ అభిమానులు పచ్చి బూతుగా భావిస్తున్నారు. వైసీపీపై ప్రజల్లో విశ్వాసం వుంటే, ఎన్నికల్లో ఘోర పరాజయం ఎందుకు ఎదురవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ పాలనలో జరిగిన మంచి, అలాగే సంక్షేమ పథకాల ఫలాల్ని కోట్లాది మందికి అందించామని, వారి ఓట్లన్నీ ఏమయ్యాయని పదేపదే జగన్ ప్రశ్నించడంపై వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
తన పాలన నచ్చితేనే ఓట్లు వేయాలని జగన్ ప్రచారం చేయడాన్ని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడిన తర్వాత కూడా.. తాను చేసిన మంచి ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని ఎలా చెబుతున్నాడో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు.
ఓటమిపై ఆత్మ పరిశోధన చేసుకుంటామని, లోపాల్ని సరిదిద్దుకుని, మళ్లీ ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నిస్తామనే మాట ఇంత వరకూ జగన్ నుంచి రాకపోవడం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఈవీఎంలపైనో, మరొకరిపైనే నింద వేసి, పాలనలోని లోపాలను దాచి పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటని వారు నిలదీస్తున్నారు. జగన్ వైఖరి చూస్తుంటే, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మారనని, ప్రజలే మారిపోయి, మళ్లీ తనకే అధికారం ఇస్తారనే అభిప్రాయంలో ఉన్నట్టు కనిపిస్తోందని వైసీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.