మీటింగ్ సరేసరి.. వ్యక్తిగత హామీ అయినా దక్కిందా?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ప్రత్యేక విమానం కట్టించుకొని మరీ వాలిపోయారు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు. వీళ్లంతా పవన్ తో ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి, ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన…

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ప్రత్యేక విమానం కట్టించుకొని మరీ వాలిపోయారు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు. వీళ్లంతా పవన్ తో ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి, ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం గురించి సుదీర్ఘంగా చర్చించి ఉంటారని అంతా భావించారు. అందుకే మీడియా కూడా పడిగాపులు పడింది.

కట్ చేస్తే, అలాంటిదేం లేదని తేల్చేశారు నిర్మాత అల్లు అరవింద్. కేవలం పవన్ ను అభినందించడానికే స్పెషల్ ఫ్లయిట్ వేసుకొని వచ్చారంట. టైమ్ ఇస్తే చంద్రబాబును కూడా అభినందించుకుంటారట. అదీ విషయం.

మీటింగ్ లో ఏదీ జరగలేదనే విషయం తేలిపోయింది. కనీసం ఆ ముగ్గురు నిర్మాతలకు వ్యక్తిగత స్థాయిలో పవన్ నుంచి హామీ అయినా దక్కిందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

పవన్ ను కలిసిన ప్రొడ్యూసర్లలో ఆయనతో సినిమాలు చేస్తున్న ముగ్గురు నిర్మాతలు కూడా ఉన్నారు. ఎర్నేని నవీన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, డీవీవీ దానయ్యతో ఓజీ సినిమా, ఏఎం రత్నంతో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు పవన్.

చాన్నాళ్లుగా ఈ 3 సినిమాలు ఆగిపోయాయి. ఎన్నికలు ముగిసి, ఫలితాలొచ్చిన తర్వాత పవన్ సెట్స్ పైకి వస్తారని అనుకుంటే, ఆయన ఉపముఖ్యమంత్రిగా, కొన్ని శాఖలకు మంత్రిగా మారి మరింత బిజీ అయిపోయారు. ఇలాంటి టైమ్ లో పవన్ ను ప్రత్యేకంగా కలిసే అవకాశం వచ్చింది ఈ ముగ్గురు నిర్మాతలకు. మరి పవన్ నుంచి వీళ్లకు ఏమైనా ప్రత్యేక హామీ లభించిందా? ఈ ముగ్గురిలో పవన్ ఎవరికి ముందుగా అవకాశం ఇవ్వబోతున్నారు?

తాజా సమాచారం ప్రకారం, పవన్ మరో నెల రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నారు. ఈ గ్యాప్ లో ఆయన 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నారు. ఆ తర్వాత మంత్రిగా తన నియోజకవర్గం పర్యటనలు, కేబినెట్ భేటీలు, రివ్యూ మీటింగ్స్ లాంటివి చూసుకొని అప్పుడు సినిమాలకు కాల్షీట్లు ఇచ్చే విషయంపై ఆలోచిస్తారు.

చంద్రబాబు సీఎం అయ్యారంటే మంత్రులు, అధికారులు ఆయన చుట్టూ తిరగాల్సిందే. లెక్కలేనన్ని కేబినెట్ మీటింగ్స్ పెడతారు, అలా పెట్టిన ప్రతిసారి ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ ఆ భేటీలకు వెళ్లాల్సిందే. మరి చంద్రబాబు పవన్ ను సినిమాలు చేసుకోనిస్తారా? అనేది చూడాలి.