చంద్రబాబు నాయుడు మంత్రి వర్గం మొదటి సమావేశం మీద రాష్ట్ర ప్రజలకు కొంచెం ఎక్కువ ఆశలే ఉండేవి. ప్రజల ఆశలను ఏమాత్రం పట్టించుకోలేదు అన్నట్లుగానే మొదటి క్యాబినెట్ సమావేశం ఒక్క కొత్త నిర్ణయం కూడా లేకుండా అసంతృప్తికరంగానే ముగిసింది. కేబినెట్ నిర్ణయాలలో అయిదు సంతకాల వ్యవహారం తప్ప ఇంకేం లేదు.
చంద్రబాబు నాయుడు తొలి కేబినెట్ భేటీ మీద ప్రజలకు చాలా ఆశలున్నాయి. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీల గురించి ప్రజలు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయిదు సంతకాలు అనేవి ప్రజల దృష్టిలో పాతబడిపోయాయి. మెగా డీఎస్సీ, లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, స్కిల్ గణనకు సంబంధించి ఇప్పటికే బోలెడంత ప్రచారం అయిపోయింది. కానీ తొలి కేబినెట్ భేటీ కేవలం ఆ సంతకాలకు ఆమోద ముద్ర వేయడం తప్ప మరొక ఎజెండా లేకుండా ముగిసింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన చాలా చాలా హామీల పట్ల ఆశలు పెంచుకుని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఇది ఖచ్చితంగా నిరాశే.
తెలంగాణలో రేవంత్ రెడ్డి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీని తొలి రోజు సంతకాలతోనే అమలు చేసేశారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ విషయంలో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకున్నట్టు లేదు. సూపర్ సిక్స్ హామీలలో ప్రభుత్వానికి తక్కువ ఆర్థిక భారం కాగల వాటినైనా సత్వరం ప్రారంభిస్తే.. ప్రభుత్వం ప్రజల అంచనాలను కాస్త అందుకున్నట్టుగా ఉంటుంది.
జులై నెలలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈలోగా తమ పార్టీ ఇచ్చిన అనేకానేక హామీల విషయంలో కొన్నింటినైనా పట్టాల మీదికి తేవడానికి కసరత్తు జరగాలి. రవాణా మంత్రి ఉచిత బస్సు ప్రయాణంను నెలలోగా అమలు చేస్తాం అని అన్నారు.
నిజం చెప్పాలంటే.. సూపర్ సిక్స్ అనే ఏడాది కిందట ప్రకటించిన హామీలు అన్నింటి మీద ప్రజలకు ఆశ ఉంటుంది. వాటిని ప్రభుత్వం వీలైనంత త్వరగానే కార్యరూపంలోకి తేవాల్సి ఉంటుంది. అంచెలవారీగా అని అయిదేళ్లలోగా ఆ ఆరూ అమల్లోకి తెస్తామంటే అది వంచనే అవుతుంది. ఆ సంగతి చంద్రబాబునాయుడు గుర్తుంచుకోవాలి.