శతకోటి సమస్యలకు అనంతకోటి కష్టాలు కలసి అన్నీ వైసీపీకే చుట్టుకుంటున్నాయి. భారీ ఓటమితో పార్టీ పాతాళానికి కృంగిపోయింది. అధికారం పోయాక ఎవరూ చడీ చప్పుడూ చేయడం లేదు. ఎవరు ఏమిటి ఎక్కడ ఉన్నారు అన్నది కూడా అర్థం కావడం లేదు.
ఈ మధ్యలో వైసీపీని అధికార పార్టీ టార్గెట్ చేస్తోంది. అది రాజకీయంతో పాటు వ్యక్తిగతంగానూ అని ఫ్యాన్ పార్టీ వారు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం ఒక వార్త విశాఖ సహా ఏపీ అంతా చక్కర్లు కొట్టింది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఆ వార్త వైరల్ అయింది.
విశాఖ జిల్లా పెందుర్తి మాజీ వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్యా యత్నం చేశారని ఆ వార్త సారాంశం. అయితే దాని మీద వైసీపీ నుంచి ఏ రకమైన ఖండనలూ లేకపోవడంతో అదే నిజమని అనుకున్నారు. అది అలా పాకిపోయింది. ఎందుకు ఆయన అంత పని చేశారు అని కూడా చర్చ సాగింది.
ఆ తరువాత తాపీగా అదీప్ రాజ్ వీడియో బైట్ వదిలారు. తనకు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిందని అందుకే ఆసుపత్రిలో చేరాను అని అన్నారు. ఓటమి బాధలో ఉంటే తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఇలా విష ప్రచారం చేస్తారా అని ఆయన ఫైర్ అయ్యారు.
మాజీ ఎమ్మెల్యే చెప్పినది ఆయన సొంత వివరణ కాబట్టి నమ్మాలనుకున్నా మరో వైపు కొత్త కోణం కూడా ఉందని అంటున్నారు. ఆయనకు వివాహేతర సంబంధం ఉందని, అలా బయట పోరూ ఇంటి పోరూ ఎక్కువ కావడంతోనే ఆయన అలా నిద్ర మాత్రం మింగి తనువు చాలించాలని అనుకున్నారని ఆ వార్త చక్కర్లు కొడుతోంది.
ఇందులో ఏది నిజం అంటే ఎవరూ చెప్పలేరు. ఆయన సెలిబ్రిటీ కాబట్టి వ్యక్తిగతం కూడా వెలికి తీసి చూస్తామని అంటున్న వారు మాత్రం మాజీ ఎమ్మెల్యేది ఆత్మహత్యా యత్నమే అని అంటున్నారు. వైసీపీకి విశాఖలో సీట్లూ ఏవీ రాలేదు. భారీ ఓటమితో ఉన్న పార్టీకి ఈ రకంగా తలనొప్పులు కూడానా అని తలలు పట్టుకుంటున్నారు.