ఫన్ పుట్టించగలిగే సత్తా వుండాలే కానీ పెద్దగా క్లిష్టమైన పాయింట్ అక్కరలేదు. చిన్న చిన్న షార్ట్ ఫిలిం లతో వచ్చి, వైజాగ్ హర్ష కాస్తా వైవా హర్షాగా మారిన కమెడియన్ ఇప్పుడు హీరోగా సినిమానే చేసేసాడు. హీరో రవితేజ ఈ సినిమా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. ఓ గిరిజన గ్రామంలో లేదా చిన్న పల్లె లో జనాలకు హీరో ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నంలో ఎదుర్కొన్న సమస్యలను వినోదంగా డీల్ చేసినట్లు కనిపిస్తోంది విడుదల చేసిన టీజర్ చూస్తుంటే.
టీజర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ తో వుంది. పక్కాగా జనాల దృష్టి తనవైపు తిప్పుకునేలా వుంది. అయితే టీజర్ లో చూపించిన కాన్సెప్ట్ మాత్రమే సినిమా అంటే సరిపోదు. అంతకు మించిన, కథ కథనాలు ఏవో వుండి వుండాలి. లేదంటే ఫుల్ లెంగ్త్ సినిమా చేయరు కదా? సంభాషణలు ఎవరు రాసుకున్నారు, వాటిలో వైవా హర్ష హ్యాండ్ ఎంతవరకు వుంది అన్నది తెలియదు కానీ, అసలు కథ, కాన్సెప్ట్ ఎవరిది అన్నది కానీ అసలే తెలియదు కానీ, దర్శకుడు కళ్యాణ్ సంతోష్ కు కాస్త కామెడీ టేస్ట్ బాగానే వుందని అర్థం అవుతోంది.
ఎప్పుడో దశాబ్దాల క్రితం ‘గాడ్స్ మస్ట్ బి క్రేజీ’ వచ్చింది. తరువాత దాన్ని నిర్మొహమాటంగా కాపీ కొట్టిన ‘బొబ్బిలి రాజా’వచ్చింది. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తరువాత అమాయక గిరిజునుల నేపథ్యంలో ఈ ఫన్ మూవీ వస్తోంది.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ గిరిజనులు అమాయకులు కాదు. హీరోనే అమాయకుడు. అతనితో వాళ్లే ఆడేసుకుంటారు. మొత్తానికి ఆసక్తి జనరేట్ చేసే చిన్న సినిమా టీజర్ వచ్చింది.