గతవారం ఓ మోస్తరు అంచనాలతో రంగబలి, భాగ్ సాలే సినిమాలొచ్చాయి. ఆ రెండూ ఫ్లాప్ అయ్యాయి. ఈవారం ఏకంగా 4 డిఫరెంట్ మూవీస్ వస్తున్నాయి. ఇవన్నీ వేటికవే విభిన్నమైన చిత్రాలు కావడం విశేషం.
ముందుగా బేబి సినిమానే చూసుకుంటే, ఈతరం యువత, వాళ్ల ప్రేమల్ని ఈ సినిమాలో చూపించారు. అచ్చంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించగా వైష్ణవి చైతన్య హీరోయిన్. సాయిరాజేష్ దర్శకుడు.
ఈ సినిమాతో పాటు మహావీరుడు అనే మూవీ వస్తోంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ఇది. దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటించగా.. యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. బేబీ మూవీ కంప్లీట్ ప్రేమకథ కాగా, మహావీరుడు సినిమా ఫిక్షనల్ యాక్షన్ ఎంటర్ టైనర్. మడోన్ అశ్విన్ దర్శకుడు.
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం మామన్నన్. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి నాయకుడు పేరిట రిలీజ్ చేస్తున్నారు. ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఉదయనిధి పూర్తి స్థాయి రాజకీయ జీవితాన్ని చేపట్టే ముందు నటుడిగా చేసిన చివరి చిత్రం ఇదే. తమిళనాట కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా వివాదాస్పదమైంది కూడా. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
ఇక మిషన్ ఇంపాజిబుల్-డెడ్ రెకొనింగ్ పార్ట్-1 గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టామ్ క్రూస్ హీరోగా నటించిన ఈ సినిమా రేపట్నుంచే హంగామా చేయబోతోంది. మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. కంప్లీట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ఇది.
ఇలా ఈవారం 4 విభిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటితో పాటు భారతీయన్స్, రివెంజ్ లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. వీటిలో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.