భూముల గోలతో స్వామి పీఠం కిందకు నీళ్ళు

విశాఖలోని ఆధ్యాత్మిక స్వామి స్వరూపానందేంద్ర మీద ఇప్పుడు పెద్ద ఎత్తున అంతా విమర్శలు చేస్తున్నారు. ఆయన అయిదేళ్ల పాటు అధికార వైసీపీతో అంటకాగారని ఆగ్రహంతో ఉన్న వారు ఉన్నారు. ఆయన ఆధ్యాత్మికత విషయంలో పోటీ…

విశాఖలోని ఆధ్యాత్మిక స్వామి స్వరూపానందేంద్ర మీద ఇప్పుడు పెద్ద ఎత్తున అంతా విమర్శలు చేస్తున్నారు. ఆయన అయిదేళ్ల పాటు అధికార వైసీపీతో అంటకాగారని ఆగ్రహంతో ఉన్న వారు ఉన్నారు. ఆయన ఆధ్యాత్మికత విషయంలో పోటీ పడే స్వాములు మరో వైపు ఉన్నారు. ఆస్తికత్వం నాస్తికత్వం ఫిలాసఫీ మధ్య పోరులో స్వామిని టార్గెట్ చేసేవారు ఇంకో వైపు ఉన్నారు.

స్వాములకు ఎందుకు ఈ రాజకీయాలు రాజభోగాలు అనుకునే వారు అంతా కూడా ఆయన మీద గుర్రు మీద ఉన్నారు. ఇంతలా స్వామి వివాదాస్పదం కావడానికి కారణం వ్యవహార శైలే అని అంటున్న వారూ ఉన్నారు. వైసీపీ నేతలనే వదలని వారు స్వామిని ఎందుకు వదులుతారు అని అంటున్నారు.

స్వామి వైసీపీ ఓటమి తరువాత తనకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పి చంద్రబాబుని పొగిడినా ఆయన మీద విమర్శల దాడులు అయితే ఎక్కడా ఆగడం లేదు. తాజాగా స్వామికి భీమిలీలో ఇచ్చిన పదిహేను ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్వాధీనం చేసుకోవాలని కొత్త డిమాండ్ వచ్చింది.

భీమిలీ మండలంలో శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం అప్పనంగా పదిహేను ఎకరాల భూమిని ఇచ్చిందని విదసం రాష్ట్ర కో ఆర్డినేటవిశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ బూసి వెంకటరావు కోరారు. ఆయన ఈ రోజు గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ ని కలసి దీని మీద విజ్ఞప్తి చేశారు. ఈ భూములలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ ని నిర్మించాలని ప్రజోపయోగంగా చేయాలని ఆయన కోరారు.

అంతే కాదు శారదాపీఠం విషయంలో పూర్తి విచారణ జరిపించాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. సీఐడీ లేదా సీబీఐ చేత విచారణ జరిపించాలని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే స్వామి రాజకీయ ఇబ్బందులలో పడ్డారని అంటున్నారు. ఆయన 2014 నుంచి 2019 దాకా కూడా టీడీపీకి అనుకూలంగా లేరు అని అంటున్నారు. అయినా నాడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అయిదేళ్ళ వైసీపీ పాలనలో ఆయన కూడా దగ్గరగా ఉన్నారని రాజ గురువుగా మారారని భావించే ఇపుడు ఇలా దండెత్తి వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం శారదాపీఠం మీద ఏ విధమైన యాక్షన్ కి దిగుతుందో చూడాల్సి ఉంది.