వాలంటీర్ వ్యవస్థ అనేది వైఎస్ జగన్ బ్రైన్ చైల్డ్. అంతకు ముందు చంద్రబాబు జన్మభూమి కమిటీలు వుండేవి. గ్రామాల్లో లబ్దిదారుల ఎంపిక లో ఆ కమిటీల ప్రభావం వుండేది. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తరువాత ఆన్ లైన్ టెక్నాలజీని వాడుకుని, వీలయినంత ట్రాన్స్ పెరెంట్ గా లబ్దిదారులను ఎంపిక చేసారు. అయితే ఎక్కువ మంది వాలంటీర్లు వైకాపా నేతల సిఫార్సులతో ఉద్యోగాలు పొందినవారే అన్నది వాస్తవం. పని చేసే వారు ఎవరైనా వాలంటీర్ వ్యవస్థ వల్ల జనాలకు అయితే మంచే జరిగింది. ఇళ్ల దగ్గరకే వాలంటీర్లు వచ్చారు. పొలాల దగ్గరకే వాలంటీర్లు వచ్చారు.
అయితే రాజకీయంగా వాలంటీర్ వ్యవస్థ కాస్త అప్రతిష్ట మూటకట్టుకుంది. ఎన్నికల ముందు రాజీనామాలు చేయడం, అంతకు ముందు వాలంటర్లలో కొంత మంది చేసిన తప్పుడు పనులు ఇలా కొన్ని వివాదాలు నెలకొన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే వాలంటీర్ వ్యవస్థ ను గాడిలో పెడితే మాత్రం జనాలకు పక్కాగా ఉపయోగపడేదే.
ఎన్నికల ముందు అవసరం కోసం కావచ్చు, మరే ఇతర రాజకీయ పరమైన కారణాల వల్ల కావచ్చు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, పదివేలు జీతం చేస్తామని చంద్రబాబు మాట ఇచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత రాజీనామ చేసిన వాలంటీర్లు ఆందోళన చెందడం మొదలుపెట్టారు. ఇలాంటి నేపథ్యంలో ఈ నెల 1న పింఛన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎందుకిలా? అన్నది క్లారిటీ లేదు. నిజానికి పింఛన్ల పంపిణీకి సచివాలయ సిబ్బంది సరిపోరు. పైగా చాలా వరకు సచివాలయ సిబ్బంది నాన్ లోకల్స్. అంటే ఆయా గ్రామాల్లో వుండే వారు కాదు. వారికి వీధులు, ఇళ్లు, జనాలు పరిచయం తక్కువ. ఇప్పుడు వృద్దులను సచివాలయాలకు రప్పించి పంపిణీ చేసే అవకాశమే ఎక్కువ వుంటుంది. పొలం పాకల దగ్గరకు, ఇళ్లకు వెళ్లే అవకాశం తక్కువ వుంటుంది.
దీన్ని బట్టి చూస్తుంటే వాలంటీర్ వ్యవస్ధను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎవరెవరు వాలంటీర్లు, వారి నేపథ్యం, అర్హతలు అన్నీ చూసుకుని, వున్నవారు ఎందరు, రాజీనామా చేసిన వారు ఎందరు, అసలు ఎందరు అవసరం పడతారు.. ఇలా అన్నీ సెట్ చేసుకునే వరకు వాలంటీర్ వ్యవస్థను అలా అబేయన్స్ లో వుంచే అవకాశమే కనిపిస్తోంది.
లోకల్ తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు అందరికీ వాలంటీర్లు ఎవరు.. ఏమిటి? అన్నీ ఓ అవగాహన వచ్చాక కానీ ఈ వ్యవస్థ మీద ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువ. అప్పుడే వాలంటీర్ల జీతాల పెంపు అనేది కూడా వుంటుంది.