కల్కి సినిమా కోసం నైజాంలో టికెట్ రేట్లు పెంచిన తర్వాత ధరలపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చింది. ఏఎంబీ మాల్ లాంటి లగ్జరీ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర దాదాపు 500 రూపాయలకు చేరుకోగా.. మిగిలిన మల్టీప్లెక్సుల్లో అటుఇటుగా 430 నుంచి 470 రూపాయల మధ్యలో ఫిక్స్ అయ్యాయి.
అటు సింగిల్ స్క్రీన్స్ లో రేట్లు కూడా టికెట్ పై 75 రూపాయల చొప్పున పెరిగాయి. మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లపై కూడా క్లారిటీ రానుంది. ఇదిలా ఉండగా.. కల్కి సినిమా టికెట్ రేట్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయనే అంశంపై సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ సాగింది.
ఇందులో భాగంగా ముంబయిలోని మైసన్ పీవీఆర్ జియో వరల్డ్ డ్రైవ్ ఇన్ లో కల్కి టికెట్ ధర అందర్నీ ఆకర్షిస్తోంది. ఇక్కడ ఒక్కో టికెట్ ధర 2వేల రూపాయలుగా నిర్ణయించారు. అతి తక్కువ సీట్లతో లగ్జరీ సౌకర్యాలు అందించే థియేటర్ ఇది.
ముంబయి తర్వాత ఢిల్లీలో అత్యథిక రేట్లు కనిపిస్తున్నాయి. నగరంలోని పీవీఆర్ ఛెయిన్ కు చెందిన ఓ మాల్ లో కల్కి టికెట్ ధర 1850 రూపాయలుంది. ఇదే సిటీలో 1300-1600 రేంజ్ లో కూడా టికెట్లున్నాయి.
అటు బెంగళూరులో రిలీజ్ రోజున టికెట్ ధరలు 1100 నుంచి 1400 రూపాయల రేంజ్ లో ఉన్నాయి. ఈ విషయంలో పీవీఆర్-ఐనాక్స్ పోటీ పడుతున్నాయి. అయితే టికెట్ రేట్ల సంగతి అటుంచితే, ఆశ్చర్యకరంగా సిటీలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మాత్రం కనిపించలేదు. తెలుగు, హిందీ, కన్నడ.. ఇలా ఏ వెర్షన్ తీసుకున్నా, 2డీ లేదా 3డీ ఇలా ఏ ఫార్మాట్ లో చూసుకున్నా, అడ్వాన్స్ బుకింగ్స్ జోరు సాధారణంగానే ఉంది.
మొత్తమ్మీద బెంగళూరు, ఢిల్లీ, ముంబయి లాంటి నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ లోనే టికెట్ రేట్లు తక్కువ. అయితే ఉదయం 5.30 షో, అంతకంటే కాస్త ముందు వేసే ప్రత్యేక షోలకు మాత్రం హైదరాబాద్ లో టికెట్ రేటు బ్లాక్ లో 3వేల రూపాయలు దాటిపోయింది.