సరిగ్గా నెల రోజుల కిందట దర్శకుడు వీవీ వినాయక్ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యానికి గురయ్యారనే అనుమానాల్ని వ్యక్తం చేయగా.. ఆయన సోదరుడు వాటిని ఖండించాడు. ఆ తర్వాత వీవీ వినాయక్ నేరుగా వీడియో రిలీజ్ చేశారు.
అయితే ఆ వీడియోలో ఆయన తన ఆరోగ్య స్థితి గురించి చెప్పలేదు, పైగా నీరసంగా కూడా కనిపించారు. అప్పటి ఆ వీడియోతో పరోక్షంగా క్లారిటీ ఇచ్చి ఊరుకున్న వినాయక్, మళ్లీ ఇన్ని రోజులకు బయటకొచ్చారు. ఈరోజు విశ్వంభర సెట్స్ లో ప్రత్యక్షమయ్యారు ఈ సీనియర్ దర్శకుడు.
చిరంజీవి-వినాయక్ మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి కలిసేంత చనువు వినాయక్ కు ఉంది. ఆ అనుబంధంతో విశ్వంభర సెట్స్ కు వెళ్లారు వినాయక్.
చిరంజీవి, వినాయక్ సెట్స్ లో చాలా సేపు మాట్లాడుకున్నారు. చిత్ర యూనిట్ కి, డైరెక్టర్ వశిష్టకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి, వశిష్ట, వినాయక్ కలిసి దిగిన ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. తన ఆరోగ్యంపై పుకార్లు వచ్చిన తర్వాత వినాయక్ ఇలా బయటకు రావడం ఇదే.