వాలంటీర్ల‌కు రూ.10 వేలు జీతం.. అంతా ఉత్తుత్తిదేనా?

వాలంటీర్ల‌కు రూ.10 వేలు ఇవ్వ‌డం సంగ‌తి ప‌క్క‌న పెడితే, అస‌లు ఆ వ్య‌వ‌స్థ‌కే మంగ‌ళం పాడుతార‌నే అనుమానాల‌కు తెర‌లేచింది. చంద్ర‌బాబు కేబినెట్ మొద‌టిసారి స‌మావేశ‌మైంది. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో భాగంగా సామాజిక…

వాలంటీర్ల‌కు రూ.10 వేలు ఇవ్వ‌డం సంగ‌తి ప‌క్క‌న పెడితే, అస‌లు ఆ వ్య‌వ‌స్థ‌కే మంగ‌ళం పాడుతార‌నే అనుమానాల‌కు తెర‌లేచింది. చంద్ర‌బాబు కేబినెట్ మొద‌టిసారి స‌మావేశ‌మైంది. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో భాగంగా సామాజిక పింఛ‌న్ల‌ను గ‌తంలో మాదిరిగానే ఇళ్ల వ‌ద్ద‌కే వెళ్లి పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే చిన్న మార్పు. గ‌తంలో వాలంటీర్లు ప్ర‌తినెలా ఒక‌టో తేదీన సూర్యోద‌యం కాకుండానే, నిద్ర‌లేపి మ‌రీ పింఛ‌న్లు పంపిణీ చేసేవారు. ఈ ద‌ఫా స‌చివాల‌య ఉద్యోగుల‌తో పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

దీంతో వాలంటీర్ వ్య‌వ‌స్థ కొన‌సాగ‌డంపై చ‌ర్చ మొద‌లైంది. ఉగాది ప‌ర్వ‌దినం పుర‌స్క‌రించుకుని వాలంటీర్ల‌కు నాటి ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు శుభ‌వార్త చెప్పారు. వాలంటీర్ల వ్య‌వ‌స్థ కొన‌సాగించ‌డంతో పాటు ఇప్పుడిస్తున్న దాన్ని రెట్టింపు చేసి, అంటే నెల‌కు రూ.10 వేలు గౌర‌వ వేత‌నం ఇస్తామ‌ని చంద్ర‌బాబు గొప్ప‌గా చెప్పారు. బాబు చెబితే చేస్తార‌ని వాలంటీర్లు న‌మ్మారు. టీడీపీ సోష‌ల్ మీడియా ఇదే విష‌యాన్ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీరిన త‌ర్వాత మొద‌టి కేబినెట్ స‌మావేశంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో అనే ఉత్కంఠ. వాలంటీర్ల ప్ర‌స్తావ‌నే లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ అడుగులు చూస్తుంటే వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను లేపేసేలా క‌నిపిస్తోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌తో రాజ‌కీయంగా న‌ష్టం జ‌రుగుతుంద‌నే భ‌యమే చంద్ర‌బాబు స‌ర్కార్ వెన‌క‌డుగు వేసేందుకు దారి తీసేలా వుంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిదీ వాలంటీర్ల‌కు అప్ప‌గించి, కేడ‌ర్‌ను విస్మ‌రించింద‌నే విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. వైసీపీ అనుభ‌వాల్ని గుణ‌పాఠంగా తీసుకుని, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పై వేటు వేసే అవ‌కాశం వుంద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు సీఎం అయితే త‌మ‌కు రూ.10 వేలు వ‌స్తుంద‌ని చాలా మంది వాలంటీర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. రూ.10 వేలు జీతం… అంతా ఉత్తుత్తిదేనా అని వాలంటీర్లు న‌సుగుతున్నారు.