సమాజంలోని అన్ని వ్యవస్థలు చెడిపోయినట్టే అధికారిక వ్యవస్థ కూడా చెడిపోయింది. రాజకీయాల్లో విలువలు క్షీణించిపోతే, ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. తెలివిలేని, పెద్దగా చదువుకోని (డిగ్రీలున్నా అవన్నీ దాదాపు కాపీలు కొట్టినవే) నాయకులు, బాగా చదువుకుని ఆల్ ఇండియా లెవెల్లో పరీక్షలు పాసైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని కంట్రోల్ చేస్తారు. ఇది మన ప్రజాస్వామ్యం గొప్పతనం.
జనరల్ నాలెడ్జ్‌తో పాటు , వాళ్లు ఎంచుకున్న సబ్జెక్టుల్లో అపారమైన జ్ఞానం వుంటే తప్ప సివిల్ పరీక్షలు నెగ్గలేరు. ఇంత చదువుకుని, శిక్షణ పొందిన వీళ్లు ప్రజల కోసం పని చేయాలి. కానీ వీళ్లు నాయకుల కోసం పనిచేస్తారు. అందరూ అని చెప్పలేం కానీ, మెజార్టీ శాతం ఇంతే. మేధస్సు అంటే సమాజాన్ని పీడిస్తున్న శక్తుల నుంచి బయట పడడం. కానీ వీళ్లు కులాల రొచ్చులో కూరుకుపోతున్నారు. పార్టీలు మారినప్పుడు కొన్ని కులాలకి ప్రాధాన్యత పెరగడమే ఉదాహరణ.
దురదృష్టం ఏమంటే వీళ్లంతా పుస్తకాలు రుబ్బి , కోచింగ్‌ల నుంచి వచ్చిన వాళ్లే తప్ప, జీవితంలోని కష్టసుఖాల్ని తెలుసుకున్న వాళ్లు కాదు. పెద్ద ఉద్యోగం అంటే ఎక్కువ జీతం, అధికారంలో వుండే సౌకర్యాలు మాత్రమే. పేద ప్రజల కష్టాలు, గ్రామాల్లోని రైతుల సమస్యలు, ఆకలి పోరాటం ఇవన్నీ తెలియని సుఖ జీవులు.
నిజానికి వీళ్లకొచ్చే జీతానికి విలాసంగా బతికే అవకాశం లేదు. కానీ ఒక ఎస్ఐ కూడా కోట్లు కూడబెడుతున్న నేపథ్యంలో, అనివార్యమైన పరుగు పందెంలోకి వెళ్లి నాయకుల అవినీతికి వత్తాసు పలికి తాము కొంచెం వాటా తీసుకుంటారు. సంపాదనే ముఖ్యమైతే వీళ్లకున్న తెలివికి కాంట్రాక్టులు చేసినా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పని చేసినా వస్తాయి. కానీ అధికారంలో ఉన్న మజా కోసం ఉద్యోగాల్లోకి వచ్చి ప్రజలకి అన్యాయం చేస్తారు.
నాయకుల్ని ఎదిరించి ముక్కుసూటిగా వుండడం సాధ్యమా అంటే అదంత సులభం కాదు. ఒత్తిళ్లు, కష్టాలు, బదిలీలు వుంటాయి. వీటికి సిద్ధపడిన వాళ్లు ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి వెళ్లిపోతారు. వీళ్లని చూసి సమాజం నవ్వితే పర్వాలేదు, ఇంట్లో వాళ్లు కూడా నవ్వుతారు. అవినీతికి పాల్పడని అధికారులు అసమర్థులని అర్థం.
నాయకులైనా ఎన్నికలొస్తే సంపాయించిన దాంట్లో కొంచెం ఖర్చు పెడతారు. అధికారులకి ఆ అవసరమూ లేదు. అంతా తమకే. అయితే వీళ్ల సంపాదనలో కూడా వాటా అడిగే నాయకులూ వుంటారు.
ఒక ఎస్ఐ దిగజారితే జరిగే నష్టం కంటే ఒక ఎస్పీ దిగజారితే జరిగే నష్టం చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయన కింద వేల మందితో కూడిన వ్యవస్థ వుంటుంది. ఇదంతా ఆగాలి అంటే ముందు ప్రజలు చిప్పతీసుకుని అడుక్కోవడం మానాలి. భిక్షగాడికి నిలదీసే హక్కు వుంటుందా?