జ్ఞానం వల్ల కష్టాలు, కష్టాల వల్ల మరింత జ్ఞానం. విముక్తి నుంచి బానిసత్వానికి ప్రయాణించడమే నాగరికత. పోరాడితే ఉన్నది పోతుంది. చర్యకి ప్రతిచర్య తప్పు సిద్ధాంతం. ఏ చర్యా లేకపోవడమే దినచర్య.
కోస్తారని తెలిసి నిద్రలేపడం కోడి చైతన్యం. మృత్యువుని కూతవేసి పిలిచే ఏకైక అమాయక ప్రాణం. అందమైన రెక్కలున్నంత మాత్రాన కోడి, సౌందర్య ప్రతీక కాబోదు. అదొక బిర్యానీ లేదా కబాబ్.
జాతర అందాలు చూపించి, బలిపీఠం ఎక్కించడమే రాజకీయం. రంగు అద్దాల నుంచి చూసినా, మనుషుల రంగులు మారవు. పలుగూ పారలకి గిరాకీ. పక్కవాడికి గోతులు తీయడమే నిఖార్సైన శ్రమ.
డబ్బు సంపాదించు, తెలివి అదే వస్తుంది. చలికాలంలో కూలర్లు, ఎండల్లో హీటర్లు అమ్మే వ్యాపారులు వస్తారు. వలకి చిక్కకుండా జీవిస్తే అదే చావు తెలివి.
కళల గురించి ఆలోచించకు. అన్నీ అమ్ముడుపోయే సరుకులే. మార్కెట్‌లో ఇంకా ప్రాణంతో బిక్క చూపులు చూసే చేపల్లాంటి వాళ్లు కళాకారులు. ఎలా తింటావో నీ ఇష్టం. తెలియకపోతే వంటల చానల్ చూడు. దంత శుద్ధి, వేదాంత వృద్ధి.
ఎవరికీ యధాతధ ముఖాలు ఇష్టం లేదు. అలంకారమే జీవన చంధస్సు. కరెన్సీ నోటుకి మించిన గొప్ప భాష్యకారుడు లేడు. ప్రపంచమంతా అర్థమయ్యే ఏకైక భాష.
నాణెం ఎగరేస్తే వచ్చేది అందరికీ ఆమోదమైన అద్భుత సంగీతం. మోజార్ట్ పియానో కూడా ఇక్కడ నడిసంద్రపు నావే.
అద్దంతో కూడా అబద్ధం చెప్పించడమే ఆధునిక జీవన శైలి. చదవక్కర్లేకుండానే ప్రతివాడూ కథోపనిషత్తు చెప్పగలడు. ఎవడి కథ వాడు మరిచి, ఎదుటి వాళ్ల కథలు చెబుతున్నాడు. అందరి కథల్ని రోటి పచ్చడి చేస్తే ఒకటే కథ. బతుకు భయం కథ. దేనికి భయపడతావో అదే కవచంగా చుట్టుకుంటుంది.
యుద్ధానికి ముహూర్తాలు ఎందుకు రా పిచ్చోడా? అది నీ ఇంట్లోనే వుంది. నీలో, నీ చుట్టూ వుంది. తిథి లేకుండా వచ్చే అతిథి. కలలైనా, పీడకలలైనా మెలకువతో వుంటే వస్తాయా?
చైతన్యానికి మించిన చెత్తబుట్ట లేదు. మనిషి కూడా ఒక పురుగే. కాకపోతే దానికి మాట వచ్చు. చట్టాలు, శాసనాలు సంకెళ్లు వేస్తే అదే చచ్చు. లోకానికి నిర్వచనం ఒకటే. నిన్ను తినేది , నువ్వు తినేది. వేటగాడు అరణ్యకాలు చదవక్కర్లేదు. విల్లు, కళ్లు వుంటే చాలు. ఒకరి ప్రశాంతతని ఇంకొకరు భగ్నం చేయడమే శాంతత. అగ్ని వర్షంలో నిప్పుకోసం వెతికే వాడే జ్ఞాని.
జాగ్రత్తగా విను. నిశ్శబ్దంలో గంధర్వగానం వుంది. పాటగాడు అలసిపోయాడు. నాలుగు రోడ్ల కూడలిలో ఒక పేదవాడు వయెలిన్ తీగలు తడుతున్నాడు. తీగల మీద ఆకలి ప్రవహిస్తూ వుంది. కాసింత అన్నం ముద్ద కోసం వేళ్లు తడుముతున్నాయి. జనమంతా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఎవరి దారి ఎటు ఎవరికీ తెలియదు.
మునిగే నౌకకి దిక్సూచి ఎందుకు? ఉత్తరం, దక్షిణం అన్నీ ఒకటే. లోకం ఒక చెడిపోయిన గడియారం. ఇక గంటలు వినలేవు.
జీఆర్ మహర్షి