సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి స్పీకర్ పదవిని ఇవ్వడం ద్వారా రాజకీయంగా ఆయన్ని కట్టడి చేసారు అన్న చర్చ అయితే సాగుతోంది. అయ్యన్న ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఆయన పార్టీలో తనకు నచ్చని వాటిని బాహాటంగా మీడియా ముందు చెబుతారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు అయ్యన్న సొంత ప్రభుత్వం మీదనే కొన్ని విమర్శలు చేశారు. విశాఖ జిల్లాలో భూ కబ్జాల మీద ఆయన నాడు విపక్షంతో గొంతు కలిపారు. ఇలా చాలా అంశాల మీద ఆయన కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడుతారు.
ఈసారి ఎన్నికల్లో ఆయన తనతో పాటు తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. ఒక దశలో ఆయన ఒత్తిడి సైతం తెచ్చారు అని ప్రచారం సాగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే అయ్యన్నను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా పెట్టేందుకు కట్టడి చేసెందుకే స్పీకర్ పదవిని ఇచ్చారని అంటున్నారు.
ఈ పదవితో అయ్యన్నకు గౌరవం తప్ప మరేమీ దక్కదు. అంతే కాదు ఆయన గతంలో మాదిరిగా ఫ్రీగా ఏదీ మాట్లాడలేరు ఇక ఆయనకు ఈసారితో చివరి ఎన్నికలు అని చెప్పుకున్నారు ఆయన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా లేదా అన్నది కూడా చూడాలని అంటున్నారు.
నర్శీపట్నంలో టీడీపీ పుట్టిన దగ్గర నుంచి అయ్యన్నే పోటీ చేస్తూ వస్తున్నారు. టీడీపీలో యువ తరాన్ని ప్రోత్సహించాలని పార్టీ ఆలోచిస్తోంది. రేపటి రోజున టీడీపీలో లోకేష్ టీం గా ఉండేవారిని ఎంపిక చేస్తోంది. అలా నర్శీపట్నం నుంచి అయ్యన్న వారసుడు ఉంటారా లేదా కొత్త వారు వస్తారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. స్పీకర్ పదవిని చేసిన వారు తరువాత కాలంలో రాజకీయంగా వెలగలేదు. ఇది కూడా ఇపుడు డిస్కషన్ పాయింట్ గా ఉంది.