ప్రజల తీర్పును శిరసావహించకుంటే ఆత్మవంచనే!

జగన్ తన మానసిక స్థితి మీద కనీసంగా కూడా అదుపు సాధించలేకపోతున్నారు ఎందుకు? ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగులుగానే కనిపిస్తున్నారు ఎందుకు? ‘ఏదో జరిగింది? అది దేవుడికే తెలుసు?’…

జగన్ తన మానసిక స్థితి మీద కనీసంగా కూడా అదుపు సాధించలేకపోతున్నారు ఎందుకు? ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగులుగానే కనిపిస్తున్నారు ఎందుకు? ‘ఏదో జరిగింది? అది దేవుడికే తెలుసు?’ అనే పడికట్టు మాటలను పక్కన పెట్టి.. జగన్మోహన్ రెడ్డి తనను ఇప్పటిదాకా ఆవరించిన విషాదయోగం నుంచి దూరం జరిగి.. పరిస్థితుల్ని సమీక్షించుకోవాలి.

జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనకు అందించిన అధికారాన్ని తనదైన ముద్రతో వినియోగించుకుంటూ.. ప్రయోగశీలమైన సంక్షేమ ప్రభుత్వాన్ని అందించారు. తన పరిపాలన పట్ల ప్రజల స్పందన ఎలా ఉంటుందో.. ఆయన కొన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలలో తేడా వచ్చింది తప్ప, ఈవీఎంలలో కాదు. జగన్ ఆ సంగతి జీర్ణించుకోకుండా.. ప్రజల తీర్పును శిరసావహించకుండా.. నాయకుడిగా తనకు మళ్లీ మళ్లీ పట్టం కట్టాలంటే, ప్రజలు ఆశించేవి వేరే ఉన్నాయనే సంగతి గుర్తించకుండా వ్యవహరిస్తే అది ఖచ్చితంగా తనను తాను మోసం చేసుకోవడం అవుతుంది. పార్టీని తిరిగి రైట్ ట్రాక్ మీదికి తీసుకురావాలంటే.. ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచింది! ఓడిన తర్వాత కట్టు తప్పిపోతున్న జగన్ ఆలోచన సరళిమీదనే ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ప్రజల తీర్పును శిరసావహించకుంటే ఆత్మవంచనే’!

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికల ఫలితాల పట్ల జగన్మోహన్ రెడ్డి షాక్ కు గురైనట్టుగా రాష్ట్రప్రజలందరూ  సులువుగానే గుర్తించారు. ఆయన విషాదాన్ని దాచుకోలేకపోయిన వదనంతో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి.. ‘ఏదో జరిగింది. అదేమిటో దేవుడికి తెలుసు’ అని వ్యాఖ్యానించినప్పుడు అందరూ తేలిగ్గానే తీసుకున్నారు. షాక్ లో అలాంటి అభిప్రాయాలు ఉండడం సహజం అనుకున్నారు. ‘ఏదో’ అనే పదానికి అర్థం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో అవకతవకలు జరిగినట్లుగా అభివర్ణించడం జరిగేసరికి- జగన్ ఇంత చిత్రంగా మాట్లాడుతున్నారేమిటా అని విస్తు పోయారు. పరవాలేదు ఆయన పరిస్థితిని నిదానంగానైనా అర్థం చేసుకుంటారని ప్రజలు ఆశించారు.

కానీ రెండు వారాలు గడిచిన తర్వాత.. పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులందరితో సమావేశం నిర్వహించినప్పుడు కూడా.. జగన్మోహన్ రెడ్డి తీరులో కించిత్ మార్పులేదు. పైగా ఆయన ఇప్పటికీ పరిస్థితులను జీర్ణం చేసుకోలేని మ్లానమైన మొహంతోనే ఉన్నారు. ఇంకా ఆయన సత్యాన్ని బోధపరుకోకపోతే ఎలాగ? అని ఇప్పుడు ఆయన అభిమానులే అనుకుంటున్నారు.

ఒక ప్రెస్ మీట్ గా కాకుండా.. పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన సమయానికి జగన్ తన ఓటమికి ఈవీఎంలు మాత్రమే కారణం అని ఒక నిర్ధరణకు వచ్చేశారు. ఈ మధ్యలో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉన్నదంటూ ట్వీట్లు కూడా పెట్టారు. జగన్ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న తీరు చూసి ఆయన ప్రత్యర్థులు అందరూ ఆనందించి ఉంటారు. అయితే.. పూర్తిగా ఈవీఎంల మీదికి నెట్టేయడంతో జనం అంతా నవ్వుకుని ఉంటారు లేదా బాధపడి ఉంటారు.

ఇందుకు 2019 ఎన్నికల తర్వాత జగన్ వ్యాఖ్యలు కూడా ఒక కారణం. అప్పట్లో చంద్రబాబునాయుడు కూడా ఈవీఎంల కారణంగా ఓడిపోయినట్లు ఒక వాదన వినిపించారు. దానికి కౌంటరుగా జగన్ ఆయనను తీవ్రస్థాయిలో తూర్పారపట్టారు. ‘ఆయన గెలిస్తే అంతా బాగున్నట్టు.. ఓడిపోతే ఏదో జరిగిపోయినట్టు మాట్లాడడం చంద్రబాబు అలవాటు’ అంటూ తీవ్రస్వరంతో ఎద్దేవా చేశారు. అయిదేళ్లలో సేమ్ సీన్ రిపీట్ అయింది. చంద్రబాబు ఇంకా అలాంటి మాటలు అనలేదు గానీ.. పాత జగన్ వీడియో చూస్తే.. ఆ మాటలు అచ్చంగా ఆయనకే వర్తించేలా ఉన్నాయి.

పార్టీ నాయకులు భయపడుతున్నది ఒక్కటే. ప్రజలు తమను తిరస్కరించారు అనేది తెలుసుకోకుండా పార్టీని బాగు చేసుకోవడం ఎలాగ? తమ పార్టీ ఓటమిని డయాగ్నయిజ్ చేయడంలో విఫలం అయితే ఆ నష్టం తమకే కదా! జగన్ తీరు వలన.. ఓటమి కారణం ఒకచోట ఉండగా.. తాము మందు మరొకచోట వేస్తున్నానమేమో అనే భయం  వారికి కలుగుతోంది. అందుకే జగన్ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించకుంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుందని అంతా అనుకుంటున్నారు. 

ఈవీఎంల మాటను విడిచిపెట్టాలి..

జగన్మోహన్ రెడ్డి ముందుగా ఈవీఎంలలో మాయ జరిగిందనే మాట మాట్లాడడం మానుకోవాలి. ఈ మాటల ద్వారా ఆయన మనదేశ ఎన్నికల వ్యవస్థనే అనుమానిస్తున్నారు. ఆయన ఆరోపణ ఏంటంటే.. ఈవీఎంల్లో  మాయ చేయడానికే చంద్రబాబునాయుడు సరిగ్గా ఎన్నికలకు ముందు మోడీతో పొత్తు కుదుర్చుకున్నారు అనేది! ఇదే మాట గత 2019 ఎన్నికల తర్వాత ఎవరైనా జగన్ కు ముడిపెట్టి అని ఉంటే.. కాస్త నమ్మశక్యంగా ఉండేది. ఎందుకంటే.. జగన్కు 151 స్థానాలతో పాటు, మోడీ 2.0 సర్కారు అనన్యమైన మెజారిటీతో కేంద్రంలో ఏర్పడింది. కానీ.. ఇప్పుడు పరిస్థితి వేరు. ఏపీలో ఎన్డీయే కూటమికి 164 స్థానాలు దక్కి ఉండవచ్చు. కానీ మోడీ కేంద్రంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఈవీఎంలను భాజపా  మేనేజ్ చేయడం సాధ్యమయ్యే పనే అయితే గనుక.. లోక్ సభ ఎన్నికల్లో భాజపాకు మ్యాజిక్ ఫిగర్ దాటేంత సీట్లు కట్టబెట్టుకోకుండా.. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియని చంద్రబాబునాయుడు మీద కీలకంగా ఆధారపడాల్సిన విధంగా ఎందుకు పరిమితం చేసుకుంటారు. ఈవీఎంలను మానిప్యులేట్ చేయగలిగిన తమ బలాన్ని.. 2019కి పూర్వం.. తన ప్రభుత్వాన్ని అత్యంత దారుణంగా నిందించి తూర్పారబట్టిన చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం ఎందుకు ఖర్చుచేస్తారు? అనే లాజిక్ జగన్ మిస్సయ్యారు. కానీ ఈ లాజిక్ ప్రజలు మిస్ కాలేదు. అందుకే జగన్ ఈవీఎంల మోసాన్ని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడే కొద్దీ.. జనానికి జాలి కాదు నవ్వు పుడుతుంది. 

ఎదుటివారు చెప్పేదేంటో వినాలి..

జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎవ్వరి మాటా వినరని, ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తారని.. ఇప్పుడు కాదు- ఆయన పార్టీ ప్రారంభించిన నాటినుంచి పుష్కలంగా విమర్శలు ఉన్నాయి. చాలా కొద్ది మంది మీద మాత్రమే ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారనేది పెద్ద ఆరోపణ. ఆయన ప్రతి నిర్ణయమూ ప్రజామోదం పొందుతూ వచ్చినప్పుడు ఈ తరహా ఓకే. అంటే ఆయన అధికారం వెలగబెడుతున్నప్పుడు.. ఇలా మోనార్క్ గా వ్యవహరించినా నడుస్తుంది. కానీ, ఇంత దారుణంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా.. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం తెలుసుకోకపోతే.. జగన్ ప్రజస్వామ్యానికి ఎలా సరిపోతారు? ప్రభుత్వాధినేతగా మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న నాయకుడు.. తన పార్టీలో కనీస ప్రజాస్వామిక ప్రమాణాలను పాటించకపోతే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు.

శాసనసభ సమావేశాలు మొదలు కావడానికి ఒకరోజు ముందు జగన్ తన పార్టీ వారితో పెద్ద సమావేశం పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కావడం సాంప్రదాయం. కానీ కేవలం 11 మందితో భేటీ జగన్ కు అవమానం అనిపించిందేమో.. పార్టీ తరఫున పోటీచేసిన అందరినీ పిలిచి మీటింగు పెట్టుకున్నారు. నిజానికి అలాంటి ప్రయత్నం ఓటమి సంభవించిన నాలుగైదు రోజుల వ్యవధిలో జరిగి ఉండాలి. అప్పటికి తానింకా షాక్ నుంచి బయటకు రాలేదన్నట్టుగా ఆయన మిన్నకుండిపోయారు. కానీ ఈ విస్తృతస్థాయి సమావేశంలో  మరొకనాయకుడు అయితే.. ఆయా అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారో.. వారి మనోగతం ఏమిటో తెలుసుకుని ఉండేవారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ఏకరీతిలో పరాభవాలు పలకరించినప్పుడు.. మూలకారణాలు క్షేత్రస్థాయిలోని వారినుంచే తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే జీవం ఉంటుంది. వారు రకరకాల కారణాలు చెప్పవచ్చు గాక.. వారందరూ కూడా తెలుగుదేశం కూటమి పక్షాలు మోసం చేశాయనే మాటలనే వల్లించవచ్చు గాక.. కానీ జగన్ ముందుగా వారిని అడిగి, వారు చెప్పింది వినాలి. అంతా పూర్తయ్యాక అందరు చెప్పిందీ క్రోడీకరించుకుని.. సహేతుకంగా ఉన్న కారణాల్ని విశ్లేషించుకోవాలి. మలిదశలో ప్రజల తిరస్కారానికి దారితీసిన తమ ప్రభుత్వ లోపాలని జాబితాగా తయారు చేసుకోవాలి. ఆ లోపాలను రాబోయే అయిదేళ్లలో దిద్దుకునే ప్రయత్నం చేయాలి.

కానీ అలా ఏం జరగలేదు. జగన్ పార్టీ అభ్యర్థులతో భేటీ.. ఒక సరికొత్త  ప్రెస్ మీట్ అన్నట్టుగా వ్యవహరించారు. తాను చెప్పదలచుకున్నది మొత్తం చెప్పేసి ముగించారు. 1) మీరు ఎందుకు ఓడిపోయారు? 2) పార్టీ ఎందుకు ఓడిపోయిందని అనుకుంటున్నారు? అనే రెండు ప్రశ్నలకు జవాబులను ప్రతి ఒక్కరితోనూ చెప్పించి.. రికార్డు చేసి, వాటిని క్రోడీకరించుకుని, మధించి ఉంటే చాలా గొప్పగా ఉండేది. భవిష్యత్తును దిద్దుకోవడానికి బాటలు ఏర్పడేవి. కానీ ఆ సమావేశంలోనూ జగన్ ప్రసంగం మాత్రమే సాగింది. మరొకటి లేదు. ఆ ప్రసంగం కూడా ఎన్నికల ప్రచార ప్రసంగానికి కాస్త ఎక్స్‌టెన్షన్ అన్నట్టుగా సాగింది.

తన ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం పేరుతో పంచిపెట్టిన పథకాలు.. లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన మొత్తం.. వెరసి ఎన్ని లక్షల కోట్లు ప్రజలకు పంచారు.. ఈ కబుర్లన్నీ చెప్పారు. అలాంటి సమావేశంలో అవసరమైన సంగతులు కావు అవి. అవ్వాతాతల, అక్కచెల్లెమ్మల అభిమానం, ప్రేమ అన్నీ ఎక్కడికెళ్లాయి? అంటూ పాత ఆవేదననే మళ్లీ చెప్పుకొచ్చారు. కానీ తాను అంటున్న అభిమానం ఒక భ్రమ అని ఆయన గుర్తించలేదు.

ఆత్మవంచన పార్టీకి నష్టదాయకం

ఈ ఆత్మవంచన పార్టీకి చాలా చేటు చేస్తుంది. ఇప్పుడు జగన్ చెబుతున్న మాటల సారాంశం ఏమిటంటే.. ‘‘ప్రజల్లో తన పట్ల అభిమానం ప్రేమ అలాగే ఉన్నాయి. తాము కేవలం మోసానికి గురయ్యాం. శకుని పాచికలు వేసి ఇంటర్వెల్లో కౌరవులను గెలిపించినట్టుగా- మోసంతో నరేంద్రమోడీ తెలుగుదేశాన్ని గెలిపించాడు. ఇది ఇంటర్వెల్ మాత్రమే.. క్లయిమాక్స్ లో అంటే, 2029 ఎన్నికల్లో తెలుగుదేశాన్ని సింగిల్ డిజిట్ కు పరిమితం చేసి తమ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది.’’

ఓటమికి దారితీసిన తన ప్రభుత్వ పాలన లోపాలు, తమ పార్టీ లోపాలు ఏమైనా ఉన్నాయా? అని ఆయన  కనీసం  ఆదిశగా ఆలోచించడం కూడా లేదు. అవేం లేవని ఫిక్సయిపోయారు. కేవలం మోసం వల్ల ఓడిపోయానని అంటున్నారు. అంటే.. తమ పార్టీని సంస్కరించుకోవాల్సిన అవసరం లేదని ఆయన నమ్ముతున్నారన్నమాట. ఇలాంటి నమ్మకం ఆయన పార్టీని ముంచేయకుండా ఎలా ఉంటుంది? లోపాలను గ్రహిస్తేనే వాటిని దిద్దగలరు. లోపాలే లేవని వాదించడం వల్ల.. ఇప్పటిదాకా పార్టీ నాయకులు ఎలా పనిచేశారో, జగన్ ఎలా వ్యవహరించారో.. ఇకమీదట రాబోయే అయిదేళ్లలో కూడా అలాగే వ్యవహరిస్తే చాలు.. ఆటోమేటిగ్గా తాము కనీసం 166 స్థానాలతో అధికారంలోకి వచ్చేస్తాం అని ఆయన భావించడమే ఆత్మహత్యాసదృశం. 

సలహాదార్ల మాయలోంచి బయటకు రావాలి..

వాస్తవ చిత్రం ఇలా ఉంది. మరి జగన్ ను ప్రభావితం చేయగలుగుతున్న సలహాదార్లు ఏం చేస్తున్నారు? చూడబోతే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమూ.. ఆయనకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియనివ్వకుండా ఆయన చుట్టూ పొరల్లా కమ్మేసిన వారు.. ఇప్పటికీ ఆయనను అదే తరహా భ్రమల్లో పెట్టినట్టుగా కనిపిస్తోంది.

ఎన్నికల్లో ఓటమి తర్వాత సాహసించిన కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు జగన్ ప్రధానంగా ఆధారపడే ధనంజయరెడ్డి మీద ఒక రేంజిలో విమర్శలు చేశారు. కేవలం ధనంజయరెడ్డి తమ పార్టీ ఓటమికి కారణం అన్నారు. ఆయన సైంధవుడిలాగా పార్టీ నాయకులకు, జగన్ కు మధ్య అడ్డుగోడగా మారారన్నారు. అలాగే సజ్జల రామక్రిష్ణారెడ్డి మీద ఉన్న విమర్శలు కూడా తక్కువేం కాదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా జగన్ స్పందించి తీరాల్సిన ప్రతి సందర్భంలోనూ తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడే సజ్జల రామక్రిష్ణారెడ్డి జగన్ ను ప్రభావితం చేసిన వారిలో అగ్రగణ్యుడు. వారి పుణ్యమా అని ఆయన ఇప్పటికీ వాస్తవాలు తెలుసుకోకుండా ఉన్నారని, ఆలోచనలు పెడదారి పట్టిపోతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

పార్టీని నడిపే విధానం అంటే.. రిషిరాజు మీద ఆధారపడడమా అనే ప్రశ్న కూడా వస్తోంది. ఐప్యాక్  ఉద్యోగి అయిన రిషిరాజు ఎవరు? అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలో, చివరికి మీడియాలో ఎవరికి యాడ్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాలతో సదరు రిషిరాజు ఎలా డిసైడ్ చేయగలరు? జగన్ తన సొంత నిర్ణయాలు లేకుండా అంత అచేతనంగా ఎలా ఉండగలిగారు. అనేది ఇక్కడ కీలకంగా పార్టీలో జరుగుతున్న చర్చ!

జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఏర్పడిన కోటరీ ఇప్పుడు పార్టీని ముంచేసిందని అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆ కోటరీ అనేది 1 టూ 10 పూర్తిగా రెడ్డి సామాజికవర్గంతోనే జగన్ నింపుకున్నారు. ఆయన రెడ్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారనే మాట బహుధా ప్రజల్లోకి వెళ్లింది. అంతే తప్ప.. చివరికి రెడ్డి కులానికి చెందిన వారు కూడా ఎన్నికల్లో పూర్తిగా ఓటు వేయలేదన్నట్టుగా పరిస్థితి తయారైంది.

‘తాను మోసానికి గురయ్యాను’ అని జగన్ నమ్ముతున్నారు. అది నిజమే కావొచ్చు.  కానీ ఆ మోసం చేసినది ఈవీఎంలు, వాటిరూపేణా ఎన్డీయే కూటమి అనే దురూహలలోంచి ఆయన బయటకు రావాలి. ఆయనను కేవలం చుట్టూ ఉన్న వారు మాత్రమే మోసం చేశారు. కేవలం సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంటికీ డబ్బు ఇస్తే చాలు.. ప్రజలు ఎగబడి ఓట్లు వేస్తారు.. అనే భావనను ఆయనలో చాలా బలంగా పాతిపెట్టారు. ఆ డబ్బు పంపిణీ కారణంగా గెలిచిపోతాం అనుకోవడమే ప్రజల ఆలోచన సరళి గురించి ఆయన అంచనా. అది తప్పింది. అవ్వతాతల, అక్కచెల్లెమ్మల అభిమానం అనే మాట చెబుతూ.. దాన్ని డబ్బుతో తూకం వేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు.

బహుశా ఆయన చెబుతున్నట్టు వారిలో ఇప్పటికీ అభిమానం పుష్కలంగానే ఉండొచ్చు. జగన్ అంటున్నట్టు.. ఆయన తలెత్తుకుని రాష్ట్రంలోర తన పథకాల లబ్ధి పొందిన ప్రతి ఇంటికీ వెళ్లినా.. వారు అదే అభిమానం, ప్రేమ పుష్కలంగా చూపిపంచవచ్చు. తాను ఇచ్చిన డబ్బు ద్వారా ఆ అభిమానం వచ్చిందని జగన్ అనుకోవచ్చు.. అభిమానం పుష్కలంగా ఇస్తాం దాన్ని ఓటులాగా చూడొద్దు అని ప్రజలు అంటున్నారు. ఆ సున్నితమైన వ్యత్యాసం జగన్ గ్రహించడం లేదు. గ్రహించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు.

ఇప్పటికైనా ఆయన కళ్లు తెరవాలి. వాస్తవమైన కారణాల్ని గ్రహించాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీని తయారుచేయాలి. అదేం చేయకుండా.. ఉత్తినే కూర్చుని.. చంద్రబాబు పాపాలు.. శిశుపాలుడి పాపాల్లా పండి.. తమకు అధికారం దక్కుతుందని భ్రమల్లో విహరిస్తూ ఉంటే భవిష్యత్తు అంధకారమయం అవుతుంది. 

..ఎల్. విజయలక్ష్మి