వైసీపీ ఇపుడు విపక్షంలో ఉంది. దానికి మించి సవాళ్ళు ప్రతీ రోజూ ఎదుర్కొంటోంది. ఇటువంటి కష్టకాలంలో సీనియర్లు మౌనం పాటిస్తూ పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఏపీలోని వైసీపీ పార్టీ ఆఫీసులు అన్నింటికీ నోటీసులు జారీ చేసి వారంలోగా సంజాయిషీ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్న నేపధ్యంలో సీనియర్లు ధీటుగా రంగంలోకి దిగి రిప్లై ఇచ్చి ఉండాలి.
కానీ ఉత్తరాంధ్రలో చూస్తే సీనియర్లు చాలా మంది ఉన్నా ఎందుకో సైలెంట్ అయ్యారు. అసలు వారంతా ఎన్నికల ఫలితాల నుంచే మౌన ముద్రలో ఉన్నారు. ఏ అవసరం అయినా దేని గురించి మాట్లాడాల్సినా విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మాత్రమే సిద్ధంగా ఉంటున్నారు.
ఆయనే అడుగు ముందుకేసి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. టీడీపీ భవనాలు అన్నీ సక్రమమా అని నిలదీస్తున్నారు. తమ పార్టీ ఆఫీసుకు అంటించిన నోటీసుల మీద ఆయన ఫైర్ అవుతూ కక్ష సాధింపు చర్యలు ఉంటే దానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఆయనతో గొంతు కలిపిన మరో మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదరి అప్పల రాజు. ఆయన టీడీపీకి శాపాలే పెట్టారు. కూల్చివేతలు అంటూ పాలన మొదలెట్టిన మీకు చివరికి కూల్చివేతే మిగిలిపోతుందని మీ ప్రభుత్వం ఓటమికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
తాము చేసిన మంచి కార్యక్రమాల మీద కూడా బురద జల్లుతూ సచివాలయాల మీద ఆర్బీకే సెంటర్ల మీద దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు నాశనం చేయడం ఏ రకమైన విధానం అని సీదరి గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలుగా చాన్స్ ఇచ్చిన ఒకరిద్దరు నేతలు మీడియా ముందుకు వస్తున్నారు.
చాలా మంది అయితే ఎందుకొచ్చిన తంటా అనుకున్నారో లేక కూటమి ప్రభుత్వంతో ఆదిలోనే తగవు దేనికి అనుకున్నారో తెలియదు కానీ సైలెన్స్ ని కొనసాగిస్తున్నారు. పార్టీ ఆఫీసుల మీదనే గురి పెట్టి అధికార పక్షం ముందుకు వస్తూంటే ఆత్మ లాంటి పార్టీని కాపాడుకోవడం కంటే ముఖ్యమైన సందర్భం వేరేది ఉంటుందా అని వైసీపీలో మిగిలిన వారు అంటున్నారు. ఫలితాలు వచ్చి మూడు వారాలు కాలేదు అపుడే తెల్ల జెండా చూపిస్తే అయిదేళ్ల పోరాటం ఎలా అని కూడా వైసీపీలో చర్చకు తెర లేస్తోంది.