మంత్రి పదవుల విషయంలో చంద్రబాబు మార్క్ సోషల్ ఇంజనీరింగ్ బాగానే ఉంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో పదవులు రెండూ రూరల్ కే వెళ్ళిపోయాయి. అనకాపల్లి ప్రత్యేక జిల్లా అయింది. దాంతో ఆ జిల్లాలోనే నర్శీపట్నానికి చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడుకి స్పీకర్ పదవి ఇచ్చారు. పాయకరావుపేట కు చెందిన అనితకు హోం మంత్రి పదవి ఇచ్చారు.
విశాఖ సిటీకి మాత్రం ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అంటున్నారు. అయితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని గాజువాకకు చెందిన పల్లా శ్రీనివాస్ కి ఇచ్చామని చెప్పుకోవచ్చు. కానీ పార్టీ పదవి అది. ప్రభుత్వంలో మంత్రులు ఉంటే వారి దగ్గరకు వెళ్ళి పనులు చేయించుకోవడానికి చూస్తారు.
అలా చూస్తే కనుక ఈసారి విశాఖ జిల్లాకు ఉత్త చేయి మాత్రమే లభించింది అని అంటున్నారు. వైసీపీ హయాంలో రెండవ విడతలో విశాఖ సిటీకి ప్రాముఖ్యత లేకుండా పోయింది. అపుడు టీడీపీ నుంచే విమర్శలు వచ్చాయి. పాలనా రాజధాని అని అన్నారు. విశాఖ సిటీకే చిన్న చూపా అని ఎద్దేవా చేశారు.
కానీ ఇపుడు ఆర్ధిక రాజధాని ఐటీ రాజధాని అని అనేక పేర్లు పెట్టి విశాఖ అభివృద్ధి చేస్తామని చెబుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలోనే మెగా సిటీగా ఉన్న విశాఖ నుంచి మంత్రిని నియమించలేదని అంటున్నారు. విశాఖకు మంత్రి యోగం ఉందా అంటే మరో రెండు మూడేళ్ళ వరకైనా ఆగక తప్పదేమో.