తెలంగాణలో ఇప్పుడు ఒక సరికొత్త రాజకీయ క్రీడ నడుస్తోంది. భారత రాష్ట్ర సమితి తరఫున ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గిన వారు ఎవరో ఒకరు వచ్చి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి ముచ్చట్లు సాగించి, అనంతరం ఆయన చేతుల మీదుగా కాంగ్రెసు పార్టీ కండువా కప్పించుకుంటారు.
కాంగ్రెస్ బలం ఒకటి పెరుగుతుంది.. గులాబీ దళం ఒకటి తగ్గుతుంది. వెంటనే కల్వకుంట్ల తారక రామారావు ఒక ప్రెస్ మీట్ పెడతారు. కాంగ్రెస్ పార్టీలో నైతిక విలువలు ఏవిధంగా పతనం అయిపోతున్నాయో.. ఏమాత్రం విలువల్లేకుండా తమ పార్టీ తరఫున గెలిచిన వారిని ఎలా కాంగ్రెసులో చేర్చుకుంటున్నారో.. ఆయన సుదీర్ఘంగా ఉపన్యసిస్తారు.
అక్కడితో అయిపోతుందనుకుంటే పర్లేదు. కానీ.. రెండు మూడురోజుల తర్వాత కేటీఆర్ మళ్లీ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది! ఎందుకంటే.. ఈలోగా మరో ఎమ్మెల్యే కాంగ్రెసులో చేరిపోయిఉంటారు!
భారాసను ఖాళీ చేయించే దిశగా కాంగ్రెస్ కృషి తెలంగాణలో నిరంతరాయంగా సాగుతోంది. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన ఆయనకు రేవంత్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సంజయ్ కుమార్ చేరికతో భారాస తరఫున గెలిచి కాంగ్రెసులోకి ఫిరాయించిన వారి సంఖ్య అయిదుకు చేరింది.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు ముందే కాంగ్రెసులో చేరారు. రెండు రోజుల కిందట మాజీ స్పీకరు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా చేరారు. ఇప్పుడు సంజయ్ కుమార్ అయిదో ఎమ్మెల్యే కావడం విశేషం.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను 2023లో భారాస గెలుచుకున్నప్పటికీ.. లాస్య నందిత మృతితో అనివార్యమైన ఉప ఎన్నికలో కాంగ్రెస్ చేజిక్కించుకుంది. దీంతో గత ఎన్నికల్లో 39 స్థానాలు గెలిచిన భారాస బలం ఇప్పుడు 33 కు పడిపోయింది. గులాబీ దళం నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించే ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ లెక్కన చూస్తే భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.. ప్రతి రెండు రోజులకూ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ కు, కాంగ్రెస్ పార్టీకి విలువల్లేవు అని.. తమ ఎమ్మెల్యేలను తీసేసుకుంటున్నారని అంటూనే ఉండాల్సి వస్తుందేమోనని రాజకీయ వర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి.